భువనేశ్వర్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
సిఎం కెసిఆర్‌తో తమది ఫెడరల్ ఫ్రెండ్‌షిప్: ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్
దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళతాం
ప్రజాపక్షం/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలపై తాము దృష్టి సారించలేదని, సిఎం కెసిఆర్‌తో తమది ఫెడరల్ ఫ్రెండ్ షిప్ అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదివారం భేటీ అయ్యారు. అంతకు ముందు భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కెసిఆర్ నేరుగా నవీన్ పట్నాయక్ అధికార నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కెసిఆర్‌కు నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరిగిన పర్యటనలో భాగంగా కెసిఆర్ తొలుత నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. భేటీ అనంతరం నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన పార్టీల స్నేహబంధం తో పాటు పలు అంశాలపై తాము చర్చించామని తెలిపారు. జాతీయ ప్రయోజనాల దిశగా తమ చర్చలు జరిగాయని వివరించారు. మహిళా రిజర్వేషన్లు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, పూరి జగన్నాథుడికి పూజలు చేయడానికి కెసిఆర్ ఒడిశాకు వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలపై చర్చించామన్నారు.
తమది సొంత టీమ్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తొలి అడుగు పడిందని, ఫ్రంట్ దిశగా ప్రయత్నాలను ప్రారంభించామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నవీన్ పట్నాయక్‌తో కలయిక దేశానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. తాము ఎవరికీ బీ-టీమ్ కాదని, తమది సొంత టీమ్ అని పేర్కొన్నారు. దేశం గురించి ఏదైనా చేయాలని నవీన్ పట్నాయక్ తనతో అన్నారన్నారు. దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తామని, దేశవ్యాప్తంగా పలువురు నేతలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని కెసిఆర్ అన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మార్పు కోసం చర్చలు మొదలయ్యాయని, తొలి అడుగు పడిందని తెలిపారు. వ్యవసాయరంగ అభివృద్దికి నవీన్ పట్నాయక్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతు బంధులాంటి పథకాన్ని ఒడిశాలో అమలు చేస్తుండటం తమకు సంతోషకరమని చెప్పా రు. తాము ఎవరికీ తోక పార్టీలం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇరువురం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించామని వెల్లడించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు తాము మద్దతిస్తున్నామన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.