డెలివరీ చేసిన ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం
ఆహారాన్ని చేరవేసినవారి వివరాలపై పోలీసులు, అధికారుల ఆరా
యువకుడి కుటుంబ సభ్యులతో పాటు మరో ముగ్గురు క్వారంటైన్‌కు తరలింపు
ప్రజాపక్షం/హైదరాబాద్ : హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్, అనుమానిత కేసులు భారీగా పెరుగుతున్నాయి. ట్రా వెల్ హిస్టరీ లేకున్నా కరోనా సోకడం కలవర పెడుతుంది. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా సోకడంతో హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తికి కరోనా సోకడం దాదాపు ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి నమూనాలు సేకరించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా వాటికి సంబంధించి నివేదికలు రావడంతో అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యాధికారులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. డెలివరీ బాయ్ నాంపల్లికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించి అతన్ని పోలీసులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ యువకుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తేల్చారు. ఈ బాయ్ కొద్ది రోజులుగా ఎంతమందికి ఫుడ్ డెలివరీ చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి వివరాలను సేకరిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఈ యువకుడు ఒక ప్రముఖ సంస్థలో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువకుడి కుటుంబ సభ్యులతో పాటు మరో ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించారు.
14 రోజులుగా ఫుడ్ డెలివరీ….
కరోనా సోకిన యువకుడు గత 14 రోజులుగా వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఫుడ్ సేకరించి వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేశాడు. ఏ రెస్టారెంట్లు, హోటళ్లు నుంచి ఫుడ్ సేకరించాడు, ఏ ప్రాంతాల్లో ఎన్ని ఇళ్లకు ఫుడ్‌ని చేరవేశాడనే వివరాలు కూడా అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. సహోద్యోగుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. అతను ఫుడ్ సేకరించిన రెస్టారెంట్లు హోటళ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎవరికి అనుమానం వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కరోనా సోకిన యువకుడి కుటుంబ సభ్యులతో పాటు మరో కొంత మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించినట్లు తెలుస్తోంది.