20 మంది మృత్యువాత, 111 మందికి గాయాలు
రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్ చర్చి వద్ద
నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బాంబు దాడికి పాల్పడ్డ ముష్కరులు
జోలో : బాంబు దాడులతో ఫిలిప్పీన్స్ దద్దరిల్లింది. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్ చర్చి వద్ద నిమిషాల వ్యవధిలో ముష్కరులు రెండు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 111 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మొదటగా జోలో క్యాథడ్రల్ చర్చి లోపల బాంబు పేలుడు చోటు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షలు చెప్పారు. ఈ పేలుడులో కొంత మంది గాయపడగా, చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చర్చి ఆవరణలో చుట్టుముట్టగా, చర్చి ప్రధాన ద్వారం సమీపం వద్ద రెండవసారి బాంబు పేలుడు సంభవించింది. దీంతో అనేక మంది మృత్వువాతపడడంతో పాటు గాయపడ్డారు. రెండవసారి పేలిన బాంబు పార్కు చేసిన మోటార్ సైకిల్ పెట్టినట్లు మిలిటరీ తనిఖీల్లో తేలింది. చర్చి ప్రధానహాలులో జరిగిన పేలుడుకు కిటికీ అద్దాలు ధ్వంసం కాగా, చెక్క బెంచీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే విధంగా రెండవసారి జరిగిన పేలుడు ధాటికి మృతదేహాలు, శిథిలాలు చెల్లచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దాడులు నేపథ్యంలో ముందుగా సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను నిలిపివేశారు. కాగా, ఈ పేలుళ్లలో 20 మంది మృత్యువాత పడగా, 111 మంది క్షతగాత్రులయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో 15 మంది సామాన్య పౌరులు కాగా, ఐదుగురు జవాన్లు ఉన్నారన్నారు. గాయపడ్డ వారిలో 17 మంది జవాన్లు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు కోస్ట్‌గార్డులు, 90 మంది పౌరులు ఉన్నట్లు వారు చెప్పారు. కాగా, చర్చికి వెళ్లే ప్రధాన మార్గాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మృతదేహాలను, క్షతగాత్రులను వాహనాల్లో పట్టణ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురని హెలికాప్టర్లలో సమీపంలోని జాంబోంగా నగరానికి తరలించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జనా స్పందించారు. అన్ని ప్రాంతాల్లో భద్రత పెంచాలని.. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదు. జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. గత కొంత కాలంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో బాంబు పేలుళ్లు, కిడ్నాప్‌లు, శిరచ్ఛేదనలకు పాల్పడుతూ మారణహోమాన్ని సృష్టిస్తోంది.