ప్రజాపక్షం/హైదరాబాద్/వరంగల్ : కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పాటుపడాలని, సంపూర్ణంగా కరోనాని పారదోలే వరకుక సత్యాగ్రహంలా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అంతా లాక్ డౌన్ ని స్ట్రిక్ట్ గా పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన జెడ్పీ చైర్ పర్సన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, కొందరు సర్పంచ్ లు, ఎంపీటీసీలతో, పలువురు జిల్లా కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు వైద్యాధికారులు, రవాణా, వ్యవసాయ, పౌరసఫరా, రెవిన్యూ, పంచాయతీ వంటి పలు శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం మాట్లాడారు. కరోనా నివారణకు వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో కరోనాని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
అన్నదాత రైతన్నల పంటలు చేతికి వచ్చే సమయానికి కరోనా రావడంతో వాళ్ళు అందోళన చెందుతున్నారని, కానీ, గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ధాన్యం, మక్కజొన్నలతో సహా ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకున్నదన్నారు. రైతుల గ్రామాలకే కొనుగోలు కేంద్రాలు వెళతాయని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సీఎం గారి హామీ మేరకు సంబంధిత శాఖల అధికారులంతా కలిసి ధాన్యం కోనుగోలు కేంద్రాల ఏర్పాటును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.
నిత్యావసర, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, వాటి ధరల నియంత్రణను పాటించాలని మంత్రి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పౌరసరఫరా, వ్యవసాయ, రవాణా, పోలీసు వంటి శాఖలతో కమిటీలు వేశారన్నారు. వారంతా కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మరవైపు కరోనా వైరస్ విజృంభించక ముందే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ నిర్మూలన చర్యలను పర్యవేక్షించాలని, ప్రస్తుతం ఉన్న కేసులను పర్యవేక్షిస్తూనే, కొత్త కేసుల పట్ల అప్రమత్తత అవసరమన్నారు. ప్రజలు క్వారంటైన్ ని పాటించేలా
ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్ళి…భరోసా నివ్వాలని, గుంపులు గుంపులుగా కాకుండా, ప్రజాప్రతినిధులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజల్ని చైతన్య పరచాలని ఆయా ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి పోన్ ద్వారా చెప్పారు. ప్రజలకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, ప్రభుత్వం, సీఎం కెసిఆర్ తీసుకుంటున్న అన్ని చర్యలు ప్రజలకు తెలవాలె అని మంత్రి దయాకర్ రావు అన్నారు. తద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడుతుందని తెలిపారు.
కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అని మంత్రి చెప్పారు. ప్రజలు యంత్రాంగానికి సహకరిస్తూ, సత్యాగ్రహంలా… లాక్ డౌన్ ను పాటించాలి. లాక్ డౌన్ ని పాటిస్తున్న జిల్లాల్లో కేసుల్లేవు… ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్న చోట్లనే కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి చెప్పారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న, కరోనా కట్టడిలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు మిగతా దేశాలకంటే కూడా బాగున్నాయని, ప్రజలుగా మనం చేయాల్సిందల్లా… మనం మన ఇండ్లకు పరిమితమవడమేనని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, ప్రజాప్రతినిధులమంతా కలిసి, ప్రజలకు భరోసా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు పిలుపునిచ్చారు.