విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయమే కారణం!
ఆందోళనలో కార్మికులు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కానుండడంతో దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా చూ పనుంది. వందల మంది కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ ఉక్కుకు అనుబంధంగా ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం మాధారం గ్రామంలో డోలమైట్ పరిశ్రమను నెలకొల్పారు. ఉక్కు తయారీలో ముడి పదార్థంగా వినియోగించే డోలమైట్‌ను మాధారం నుంచి ఎగుమతి చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే మాధారం డోలమైట్‌ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా లేక ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంటుకు అనుబంధంగా 1986లో మాధారంలో డోలమైట్ పరిశ్రమను నెలకొల్పారు. 1989లో ఇక్కడి నుంచి డోలమైట్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించారు. డోలమైట్ కారేపల్లి మండలంతో పాటు గార్ల, బయ్యారం మండలాల్లో కూడా విస్తారంగా లభిస్తుండడంతో అప్పట్లో 950 ఎకరాలను సేకరించారు. 210 మంది భూ నిర్వాసితులు కాగా, మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న కేవలం 125 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 150 మందికి పర్మినెంట్ ఉద్యోగులతో సహా 250 మంది ఇక్కడ పని చేస్తున్నారు. మూడు దశాబ్దాల కాలంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల డోలమైట్‌ను ఇక్కడి నుంచి విశాఖకు ఎగుమతి చేశారు. మాధారం ఏరియాలో హైగ్రేడ్ డోలమైట్ లభ్యమవుతుంది. నాణ్యమైన డోలమైట్‌ను అందిస్తున్న ప్రభుత్వ కార్మాగారం మాధారం ఒక్కటే కావడం విశేషం. ఉక్కు తయారీలో ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు డోలమైట్‌ను ఉపయోగిస్తారు. ఇనుమును కరిగించే కొలిమి గోడలకు డోలమైట్‌తో తయారు చేసిన ఇటుకలను వాడతారు. వేడిమిని తట్టుకునే శక్తి డోలమైట్‌కు ఉంటుంది. ఉక్కు తయారీలో ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న మాధారం డోలమైట్ పై విస్తృత చర్చ సాగుతుండగా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. డోలమైట్‌ను తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించడం కూడా గమనార్హం. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం రిలయన్స్‌కు చెందిన ఓ సిఈవో స్థాయి అధికారి, మరి కొందరితో కలిసి మాధారం డోలమైట్ కర్మాగారాన్ని సందర్శించినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న ఉద్యోగులను విశాఖ లేదా వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తారని తెలుస్తుంది. మొత్తంగా కర్మాగారం ప్రైవేటు పరంమయ్యే అవకాశం ఉంది.
ప్రైవేటు చేతికి మాధారం డోలమైట్?
RELATED ARTICLES