ఎఐటియుసితోనే కార్మికవర్గానికి, సింగరేణి సంస్థకు మనుగడ సంస్థపై పాలకుల పెత్తనాన్ని అడ్డుకోవాలి
వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉత్సాహంగా యూనియన్ కొత్తగూడెం శాఖ 15వ మహాసభ
ప్రజాపక్షం/కొత్తగూడెం సంస్కరణల పేరుతో సింగరేణి సంస్థను నిర్వర్యం చేసే విధంగా ప్రైవేటీకరణ, ఆర్ధిక దోపిడికి పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అడ్డుకొంటూ సంస్థను పరిరక్షించుకునే బాధ్యత కార్మికవర్గంపై ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యూనియన్ కొత్తగూడెం బ్రాంచి 15వ మహాసభ గురువారం శేషగిరిభవన్‌లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిదిగా హాజరైన కూనంనేని యూనియన్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడకముందు 64వేల మంది కార్మికులు ఉన్న సంస్థలో ప్రస్తుతం 40వేల మంది మాత్రమే ఉన్నారని, దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న సంస్కరణలే కారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి పాలన సాగిస్తున్నాడని, కారుణ్య నియామకాలు, నూతన భూగర్భగనులు, అలియాస్ పేర్ల మార్పు, కార్మికులకు స్వంతింటి పథకం వంటి హామీలను అమలు చేయకుండా సంస్థపై పెత్తనం చెలాయించే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. డిఫర్ ట్యాక్సు రూపంలో కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన బకాయి చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. యూనియన్ కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, సర్కారు సంఘం కాలపరిమితి తీరిపోయినప్పటికి ఓటమి బయంతో ఎన్నికలకు ముందుకు రావడం లేదన్నారు. కార్మికుల హక్కులు కాపాడటంలో టిబిజిఎస్ పూర్తిగా విఫలమైందని, యాజమాన్యంతో కుమ్మక్కై ఫైరవీలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. కార్మికుల నుంచి దూరమైన టిబిజిఎస్‌ను కార్మికులు ఆదరించే పరిస్థితి లేదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన కేసీఆర్ పరోక్షంగా కేంద్రానికి సహకరిస్తూ పర్మనెంట్ కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఓపెన్‌కాస్టు గనుల ఏర్పాటుకు వ్యతిరేకంగా గగ్గొలు పెట్టిన కేసీఆర్ అధికారంలోకి రాగానే నోరుమెదపడం లేదన్నారు. సింగరేణి సంస్థలో అమలవుతున్న కార్మిక వ్యతిరేక సంస్కరణలను తిప్పికొడుతూ సంస్థ మనుగడకోసం ఏఐటియుసి వందేళ్ళుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని పునరుద్ఘాటించారు. కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించిపెట్టిన ఏఐటియుసి వందేండ్ల పోరాట స్పూర్తితో సంస్థ మనుగడను, కార్మికుల సంక్షేమే లక్ష్యంగా ఏఐటియుసి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. సందేబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మహాసభలో యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, కొత్తగూడెం, కార్పోరేట్ కార్యదర్శులు జి.వీరస్వామి, వంగా వెంకట్, నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ, ఆర్థిక దోపిడీ నుంచిసింగరేణిని కాపాడుకుందాం
RELATED ARTICLES