ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలి
లంకపల్లి గుట్టల్లో మృతదేహం లభ్యం
పెనుబల్లి : ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. తనను ప్రేమిస్తూనే మరొకరితో చనువుగా మాట్లాడుతుందనే అనుమానంతో యువతిని దారుణంగా హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం తనతో మాట్లాడాలని యువతిని బైక్‌పై కొత్తలంకపల్లి గుట్టల వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆమెపై కసితో రగిలిపోతున్న నిందితుడు చేతి రుమాలతో గొంతుకు బిగించి చంపేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట గ్రామానికి చెందిన కావిటి తేజస్విని, సత్తుపల్లికి చెందిన నితిన్ ఇద్దరు కుప్పెనకుంటలోని ఇంజనీరింగ్ కాలేజిలో డిప్లొమా చదివారు. ఆ సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలిసి ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.డిప్లోమాలో కొన్ని సబ్జెక్టులు తప్పిన తేజస్విని ఇంట్లో నే వుంటుంది. నితిన్ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. అప్పటి నుంచి తరచూ ప్రియురాలికి ఫోన్‌ద్వారా సంభాషణలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తేజస్విని మరొకరితో చనువుగా ఉంటుందని తెలుసుకున్న నితిన్ ఆమెను తరచూ అనుమానిస్తుండేవాడు. రోజూ అలా వేధిస్తుండటంతో తట్టుకోలేక తేజస్విని నితిన్‌ను కొంతకాలం దూరం పెట్టింది. దీంతో ఆమెపై కసి పెంచుకున్న నితిన్ ఆదివారం సాయంత్రం తేజస్విని ఇంటి వద్దకు వచ్చి నీతో మాట్లాడాలని ఆమెను బైక్ పై తీసుకెళ్లాడు. ఇంటి వద్ద తమ కుమార్తె కన్పించకపోవడంతో చుట్టుపక్క ల వెతికిన తల్లిదండ్రులు సోమవారం విఎం బంజర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్‌డేటాతో నితిన్ ఫోన్ నెంబర్‌ను గుర్తించారు. నితిన్ ఖమ్మంలోని వసతి గృహంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం వేకువజామున నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చేతి రుమాలుతో గొంతుకు బిగించి చంపినట్లు ఒప్పుకున్నాడు.మృతదేహం కోసం గాలించగా మండల పరిధిలోని కొత్తలంకపల్లి గుట్టల వద్ద లభ్యమైంది. కల్లూరు ఏసిపి వెంకటేష్, సత్తుపల్లి సిఐ సురేష్, వియంబంజర ఎస్‌ఐ నాగరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా నిమిత్తం పెనుబల్లి ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు.
ప్రేమ.. ప్రాణాలు తీసింది
RELATED ARTICLES