HomeNewsBreaking Newsప్రారంభోత్సవం ఉద్రిక్తం

ప్రారంభోత్సవం ఉద్రిక్తం

రేవంత్‌రెడ్డి అరెస్టు
బలప్రదర్శనకు వేదికైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన మంత్రి కెటిఆర్‌ పర్యటన
శిలాఫలకాలపై తమ పేర్లు పెట్టాలన్న కొత్త కార్పొరేటర్లు
టిఆర్‌ఎస్‌, బిజెపి నేతల పరస్పర వ్యతిరేక నినాదాలు
ఎల్‌.బి.నగర్‌లో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం
ఉద్రిక్త పరిస్థితుల మధ్యే శంకుస్థాపన చేసిన కెటిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మధ్య బలప్రదర్శనకు వేదికలయ్యాయి. శనివారం హైదరాబాద్‌ మహానగరంలో మున్సిపల్‌ శాఖామంత్రి కె.టి.రామారావు పలు అభివృద్ది పనులు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కెటిఆర్‌ పర్యటన ఆసాంతం ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. ఎల్‌.బి.నగర్‌లో రిజర్వాయర్లను తను రాకముందే ఎలా ప్రారంభిస్తారని మల్కాజిగిరి ఎం.పి రేవంత్‌ రెడ్డి మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్‌ఎ డి.సుధీర్‌ రెడ్డిలను ప్రశ్నించారు. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కెటిఆర్‌ పూర్తి చేశారు. దోమలగూడ నుంచి కెటిఆర్‌ పర్యటన ప్రారంభమైంది. జిహెచ్‌ఎంసి జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాలు, నారాయణగూడ మున్సిపల్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన, ముషీరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఈస్ట్‌ పార్శిగుట్ట కాలనీలో నిర్మించిన స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. శిలాఫలకాలపై కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కెటిఆర్‌ సమక్షంలోనే టిఆర్‌ఎస్‌, బిజెపి నాయకులు, కార్యకర్తలు పరస్పర నినాదాలు చేసుకోగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. కొత్తగా ఎన్నికైన బిజెపి కార్పొరేటర్లు నిరసన తెలిపారు. కెటిఆర్‌ గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపారు. ప్రతిగా టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిహెచ్‌ఎసికి కొత్త పాలకమండలినిఏర్పాటు చేయాలంటూ గత కొద్ది జులుగా బిజెపి నేతలు, కార్పొరేటర్లు పట్టుపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ప్రగతిభవన్‌ ముట్టడికి సైతం యత్నించారు. తాజాగా మంత్రి కెటిఆర్‌ పర్యటనలో నిరసన తెలిపారు. టిఆర్‌ఎస్‌, బిజెపి శ్రేణులు పోటాపోటీ నినాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ముషీరాబాద్‌లో టిఆర్‌ఎస్‌, బిజెపి నేతలు బాహాబాహీకి దిగడంతో ముషీరాబాద్‌ ఇండోర్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. ప్రోటోకాల్‌ పాటించలేదని బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి కెటిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా అందుకు ప్రతిగా బిజెపి మోడీకి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌ నేతలు నినాదాలు చేశారు. కెటిఆర్‌ కాన్వాయ్‌కు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. అయితే ఎన్నికలు అయిపోయిన తరువాత అభివృద్ది పనుల్లో కలిసిపనిచేద్దామని కెటిఆర్‌ అన్నారు. కొత్త ఎన్నికైన కార్పొరేటర్లకు ఐదేళ్లపాటు ప్రజాసేవ చేసుకునే అకాశం ఉందని తెలిపారు. కొత్త ఎన్నికైన కార్పొరేటర్లను కూడా ఆయన వేదికలపై ఆహ్వానించారు.
ఎం.పి రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌…
ఎల్‌.బి.నగర్‌ పరిధిలో జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్‌.బి.నగర్‌ మల్కాజిగిరి ఎం.పి రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాసవి నగర్‌లో రూ.9.42కోట్ల వ్యయంతో జలమండలి నిర్మించిన జంట రిజర్వాయర్లను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. 12గంటలకు ప్రారంభోత్సవం చేయాల్సిన ఉండగా ముందుగా ఎలా చేస్తారని స్థానిక ఎంఎల్‌ఎ డి.సుధీర్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిలను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. నిర్ణీత సమయం కంటే ముందే కార్యక్రమం నిర్వహించారని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీలు, టిఆర్‌ఎస్‌ జెండాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు చించివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను నిలువరించారు. రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి అక్కడినుంచి తరలించారు.
అభివృద్ది పనులకు శంకుస్థాపన…
దోమల్‌గూడలో రూ.9 కోట్ల90 లక్షల వ్యయంతో జోనల్‌, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. నారాయణగూడ చౌరస్తాలో రూ.4 కోట్ల వ్యయంతో 4 అంతస్తుల్లో మున్సిపల్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టుతారు. బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో మంత్రి కెటిఆర్‌ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను లభ్దిదారులకు అందించారు. 126 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. 9 అంతస్తుల్లో 126 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్‌, కొత్త, పాత కార్పొరేటర్లు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments