HomeNewsBreaking Newsప్రాణాలు హరించిన ఘోర ప్రమాదాలు

ప్రాణాలు హరించిన ఘోర ప్రమాదాలు

మహారాష్ట్రలో 13 మంది, యుపిలో 17 మంది మృత్యువాత
మహారాష్ట్రలోని ప్రైవేటు బస్సు, యుపిలో ట్రాక్టర్‌ ట్రాలీ పల్టీ
ముంబయి/షహజాన్‌పూర్‌:
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మొత్తం 30 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డా రు. మహారాష్ర్టలో ఓ ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడగా, ఉత్తరప్రదేశ్‌లో ట్రాక్టర్‌ ట్రాలీ వంతెన పైనుంచి పల్టీకొట్టింది. మరో ప్రమాదంలో కారు చెట్టును ఢీకొట్టి రోడ్డు పక్కన గుంతలో పడింది. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలో బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది మృతి చెందగా.. మరో 29 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంప్రదాయ సంగీత కచేరి బృందం ఒకటి పుణె నుంచి ముంబయి వెళుతుండగా.. రాయ్‌గడ్‌ జిల్లాలోని పాత ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున 4 గంటల 50 నిమిషాలకు షింగ్రోబా ఆలయం వద్ద.. బస్సు లోయలో పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్థానికంగా ఉండే ట్రెక్కింగ్‌ గ్రూపు సభ్యుల సాయం తీసుకున్నారు. బస్సులో ఉన్నవారు గోరెగావ్‌కు చెందిన బాజి ప్రభు వాదక్‌ గ్రూపు సభ్యులని గుర్తించారు. గాయపడిన 29 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. చనిపోయినవారు 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యవారేనని పోలీసులు తెలిపారు. ‘బస్సులో దాదాపు 42 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నాం. బాధితుల్లో కొంతమంది ముంబయిలోని సియోన్‌, గోరెగావ్‌ ప్రాంతానికి చెందినవారు. మరికొందరు పాల్ఘర్‌ జిల్లాకు చెందినవారు. వీరంతా పుణెలోని పింప్రి చించ్వాడ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబయికి బయలుదేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది’ అని చెప్పారు. మరోవైపు.. బస్సులోయలో బోల్తా కొట్టిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అధికారులను శిందే ఆదేశించారు.
వంతెన పైనుంచి పడిన ట్రాక్టర్‌ ట్రాలీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో ఓ బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 మంది మహిళలు, ఇద్దరు ఇన్నారులు ఉన్నారు. దాదాపు 24 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తిలిహాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిర్సింగ్‌ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఊరి ప్రజలు రెండు ట్రాలీల్లో నదిలోకి నీటి కోసం వెళ్లారు. నీటిని తీసుకున్న అనంతరం తిరిగి గ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు ఒకరిని దాటి మరొకరు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓ ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌ ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. ట్రాలీ బ్యాలెన్స్‌ తప్పి.. నేరుగా బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. అనంతరం బ్రిడ్జి రెయిలింగ్‌ విరిగి.. ట్రాక్టర్‌ గర్రా నదిలో పడింది.ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతుగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి
చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో ఓ ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. శనివారం ఇకౌనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. వీరంతా లుథియానాలో ఓ సంతాప సభకు హాజరై వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments