మధ్యప్రదేశ్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు
13 మంది మృత్యువాత
మహారాష్ట్రలోనూ నాలాలో పడిపోయిన ఎస్‌యువి : ఆరుగురు మృతి
భోపాల్/ముంబయి: మధ్యప్రదేశ్,మహారాష్ట్రలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో బస్సు నదిలో పడిపోగా, మహారాష్ట్రలో ఎస్‌యువి వంతెన పైనుంచి ఫల్టీ కొట్టింది. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రవైపునకు వెళ్తున్న ఓ బస్సు మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో సోమవారం అదుపుతప్పి నర్మద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 15 మందిని రక్షించిట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి)కు చెందిన బస్సు 30 నుంచి 32 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెప్పారు. కాగా, బస్సు మధ్యప్రదేశ్ ఇం డోర్ నగరం నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బయలు దేరి మహారాష్ట్ర జల్గాన్ జిల్లా అమల్‌నేర్‌కు వెళ్తున్నట్లు ఎంఎస్‌ఆర్‌టిసి అధికారులు తెలిపారు. అయితే 10 గంటల ప్రాంతంలో ఖల్‌ఘాట్ మధ్య ఉన్న వంతె న రీలింగ్‌ను ఢీకొట్టి నదిలోకి దూసుకెళ్లిందన్నా రు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది మృతదేహాలను వెళికి తీసినట్లు ఇండోర్ జోన్ ఐజి రాకేష్ గుప్తా మీడియాకు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ దళం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారని, బాధితుల్లో 8 మందిని గుర్తించిట్లు ఎంఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనను విడుదల చేసింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని, వారి పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నట్లు సంస్థ ఆ ప్రకటనలో వెల్లడించింది. డ్రైవర్ చంద్రకాంత్ ఎక్‌నాథ్ (45), కండక్టర్ ప్రకాష్ శ్రావణ్ చౌదరి (40)లు జల్గాన్‌లోని అమల్‌నేర్ నివాసులుగా ఎంఎస్‌ఆర్‌టిసి తెలిపింది. గుర్తించిన మరో ఆరుగురిలో రాజస్థాన్‌లోఇ జైపూర్‌కు చెందిన చేతన్ రామ్‌గోపాల్ జాంగిడ్, ఉదయ్‌పూర్‌కు చెందిన జగన్నాథ్ హేమరాజ్ జోషి (70), అమల్‌నేర్‌కు చెందిన నిబాజి ఆనంద్ పాటిల్ (60), కమలాబాటి నిబాజి పాటిల్ (55), మహారాష్ట్ర అకోలాకు చెందిన ఆర్వా ముర్తుజా బోరా (27), మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన సైఫుద్దిన్ అబ్బాస్ నిరానిలు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించాలని ఇండోర్ డివిజనల్ కమిషనర్ (రెవెన్యూ) పవన్ కుమార్ శర్మ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నదిలో ఉధృతంగా ప్రవహిస్తుందని, సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ కొనసాగిస్తున్నట్లు బోపాల్‌లో మిశ్రా విలేకరులకు వెల్లడించారు. ఆ తరువాత క్రేన్ సహాయంతో బస్సును నది నుంచి వెలికి తీసి రహదారిపై వాహన రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతులకు ఒక్కొక్కరి చొప్పున రూ. 10 లక్షల పరిహార్ చెల్లించాలని ఎంఎస్‌ఆర్‌టిసిని ఆదేశించారు. ఆ తరువాత ఎంఎస్‌ఆర్‌టిసి మృతులకు కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 10 లక్షలు అందిస్తామని, క్షతగాత్రులకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటించింది. అయితే ప్రమాదం విషయాన్ని ముందుగా మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర సిఎంకు, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఘటన పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఎస్‌యువి, బైక్ ఢీ : ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని అమరావతి జిల్లాలో ఓ ఎస్‌యువి ద్విచక్రవాహానిన ఢీకొట్టి వంతెనపై నుంచి నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిట్లు పోలీసు అధికారులు చెప్పారు. పరట్‌వాడా రహదారిపై ఉన్న నింభోరా ఫటా సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌యువి, బైక్ రెండుకూడా పరట్‌వాడా నుంచి బోడడ్ గ్రామానికి వెళ్తున్నాయి. ఎస్‌యువి డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ద్విచక్ర వాహనానిన ఢీకొట్టి వంతెన పైనుంచి నాలాలో పడిపోయినట్లు అధికారులు చెప్పారు. ఎస్‌యువిలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో నలుగురు చనిపోయారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం రెండు వాహనాలు వంతెన పైనుంచి నాలాలో పడిపోయాయి. దీంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులకు అక్కడ ప్రమాదం జరిగినట్లు తెలియలేదు. ఆదివారం రాత్రి 11.40 గంటలకు రెండు వాహనాలను నాలాలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు రెండు గంటల ముందే ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్పారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. నాలాలో కారు సీటు కనిపించింది. అప్రమత్తమై పరిశీలించగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
కంటైనర్, ఆటో ఢీ
ఉమ్మడి నిజామాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
8 మంది దుర్మరణం
ప్రజాపక్షం/కామారెడ్డి / ఆర్మూర్
ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పోలీసు లు, స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ వద్ద అతివేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మద్నూర్ నుండి బిచ్కుందకు ఆటోలో డ్రైవర్‌తో పాటు ఆరు మంది ప్రయాణికులు వెళ్తుండగా 161వ జాతీయ రహదారిపై మేనూర్ వద్ద బిచ్కుంద వైపు నుండి మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదంలో మరణించిన వారిలో మేనూర్‌కు చెందిన వర్షిత్ అనే విద్యార్థిని గుర్తించగా, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఘటన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల నుండి ప్రజలు పెద్దఎత్తున తరలిరాగా బిచ్కుంద, మద్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై కిసాన్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్ రహదారిపై సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని కంటెయినర్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన వల్ల ట్రాఫిక్‌జామ్ కావడంతో పోలీసులు వాహనాలను బాల్కొండ, కిసాన్‌నగర్, ముప్కాల్ ద్వారా దారి మళ్ళించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు బాల్కొండ ఎస్‌ఐ తెలిపారు.
ప్రాణాలు తీస్తున్న ప్రమాదాలు
RELATED ARTICLES