HomeNewsBreaking Newsప్రాణాలతో చెలగాటం

ప్రాణాలతో చెలగాటం

మద్దూర్‌లో ‘శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌’ సినిమాను తలపిస్తున్న ఆర్‌ఎంపిల చికిత్స
పట్టించుకోని వైద్యశాఖాధికారులు

ప్రజాపక్షం / నారాయణపేట బ్యూరో: వాళ్లు తెల్లటి డ్రెస్‌ ధరించి, మెడలో స్టేత స్కోప్‌ వేసుకుని రోగులను అచ్చం ఎంబిబిఎస్‌ డాక్టర్ల మాదిరే పరీక్షిస్తూ దొరికిన కాడికి డబ్బులు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లాలోని మద్దూర్‌ మండల కేంద్రంలో సుమారు 20 మంది ఆర్‌ఎంపిల వ్యవహారం ‘శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌’ సినిమాను తలపిస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల కింద ఓ ఆర్‌ఎంపి వైద్యుని వద్ద చికిత్స పొందిన వృద్దుడు మతిచెందిన సంఘటనే ఇందుకు నిదర్శనం. జిల్లాలోనే మద్దూర్‌ మండలంలో నిరక్షరాస్యులు, గిరిజన తండావాసులు ఎక్కువ. ఇక్కడి ప్రజలు నిత్యం ఎదో ఒక జబ్బుతో ఆర్‌ఎంపిలను ఆశ్రయిస్తుండగా, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రోగులకు తమకు వచ్చీరాని వైద్యాన్ని అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఓ గ్రామానికి చెందిన వృద్దుడు అనారోగ్యంతో ఓ ఆర్‌ఎంపి డాక్టర్‌ను సంప్రదించగా తొందరగా నయమౌతుందని ఇంజెక్షన్‌ ఇచ్చాడని, వృద్దుడు ఇంక్షన్‌ తీసుకున్న అనంతరం గ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యలో స్పృహ కొల్పోయి కిందపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకకున్న అతనిని వెంటనే తిరిగి మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు మద్దూరులోని ఆర్‌ఎంపి డాక్టర్‌ను నిలదీయగా వృద్దుని దహన సంస్కరాల నిమిత్తం రూ.35 వేలు చెల్లించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ వైద్యుడు వృద్దునికి ఇచ్చిన మందులు, ఇంక్షన్‌ ఏమిటో కనుక్కొవడం నుదిటి రాత రాస్తాడని చెప్పే బ్రహ్మకు కూడా అర్ధమయ్యే పరిస్థితి లేదు. మద్దూర్‌లో ఆర్‌ఎంపి డాక్టర్ల వ్యవహారం గత కొంత కాలంగా ఇదే విధంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత వైద్య శాఖాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలపై కొన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధిరికి ఫిర్యాదులు చేయగా ఆ అధికారి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నాట్లుగా తెలిసింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఆర్‌ఎమ్‌పిలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రజాసంఘాలు, మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపిల వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా వైద్యశాఖాధికారికి ఫిర్యాదు కూడా చేశాం. అయినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకోనట్లయితే వైద్య శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని దళిత బహుజననననసంఘం (డిబిఎస్‌) జిల్లా అధ్యక్షులు చిన్నయ్య ‘ప్రజాపక్షం’ ప్రతినిధికి తెలిపారు. ఈ విషయంపై జిల్లా డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ మనోహర్‌రావును వివరణ కోరగా త్వరలోనే స్థానిక తహశీల్దార్‌, ఎస్‌ఐని సంప్రదించి ఆర్‌ఎంపిల వ్యవహారంపై విచారించి అక్రమాలకు పాల్పడే ఆర్‌ఎంపిల కినిక్‌లను సీజ్‌ చేస్తామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments