కొరవడిన పాలకులు, అధికారుల పర్యవేక్షణ
అధైర్యపడొద్దు.. సాగునీటిని అందిస్తాం : మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రజాపక్షం/వనపర్తి బ్యూరో /వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేటలోని సరళసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం భారీగా గండి పడింది. జలాశయం పూర్తి స్థాయిలో నిండడం..లీకేజీలు తదితర కారణాల వల్ల కట్టపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎడమవైపు ఆనకట్ట తెగిపోయింది. ప్రస్తు తం పూర్తి స్థాయి నీటిమట్టం 22 అడుగులకు చేరింది. గండి పడిన తర్వాత నీరు దిగువకు పారుతోంది. మదనాపురం వద్ద కొత్తకోట రహదా రి కాజ్‌వేపై నీరు ప్రవహిస్తోంది. రామన్‌పాడు జలాశయంపై ఒత్తిడి పెరగడం తో 19 గేట్లకు గాను 9 గేట్లు తెరిచారు. దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గండిపడిన సమాచారం అందగానే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులు అధైర్యపడొద్దని, త్వరలోనే ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సరిజేస్తామని, పంటలకు నీరు వదులుతామని భరోసా ఇచ్చారు. సరళసాగర్‌లో ఉన్న నీరు రామన్‌పాడ్ ప్రాజెక్టులో స్టోరేజీ అవుతోందని, అతి తొందరగానే పెద్దవాగు నుండి నీటిని మళ్లించి తూముల గుండా వదులుతామని వివరించారు. వనపర్తి జిల్లా ఎస్‌పి అపూర్వరావు ఆధ్వర్యంతో పోలీసులు భారీ భద్రత కల్పించారు. గండి పడ్డ ప్రాజెక్టు వద్దకు ఎవర్నీ వెళ్లనీయడం లేదు.
స్తంభించిన రాకపోకలు : రైల్వే గేటు సమీపంలో ఉన్న ఊకచెట్టు వంతెనపై సరళసాగర్ ప్రాజెక్టు నీరు ప్రవహిస్తుండడంతో కొత్త కోట నుండి ఆత్మకూరు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చాలాసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జెసిబి సహాయంతో కొట్టుకు వచ్చిన కంప చెట్లను, మట్టిని తీసేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆసియా ఖండంలోనే అత్యంత పేరు గాంచిన సైఫన్ సిస్టం కలిగింది సరళసాగర్ ప్రాజెక్టు. ప్రాజెక్టులోని కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలయ్యే నీటిలో సుమారుగా 4000 ఎకరాలు సాగవుతోంది.
ప్రభుత్వం ఆదుకోవాలి : పాలకుల, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీటిని నిం పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే నేడు రైతులకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తట్టెడు మట్టి కూడా వేయలేదన్నారు. ప్రమాదం పొంచి ఉందని ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రమాదం వల్ల రామన్‌పాడ్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పొలాల్లోని పంట నీట మునిగిందని, రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సరళసాగర్ ప్రాజెక్టుకు గండి పడడానికి కారకులైన అధికారులను తొలగించాలని, రైతులను ఆదుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులతో, ఇంజనీర్లతో కలిసి పర్యవేక్షించారు.