HomeNewsLatest Newsప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోపిడీ

ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోపిడీ

పదేళ్లు దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకొన్న బిఆర్‌ఎస్‌
సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంతోషకరం
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
ప్రాజెక్ట్‌ పంపుహౌస్‌ ప్రారంభించిన సిఎం ఎనుముల రేవంత్‌ రెడ్డి

ప్రజాపక్షం/భద్రాచలం
ప్రాజెక్టుల పేరుతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి దోచుకున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని పూసుగ్గూడెం పంచాయితీ వికే రామవరం గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్‌ పంపుహౌస్‌ 2 ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఆదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని ఇష్టాను సారంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరి నదిపై రాజీవ్‌ సాగర్‌, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టులు నిర్మించేందుకు తలపెట్టారని, ఇందులో భాగంగా రూ.1500 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారని, చెప్పారు. కొంతమేరా పనులు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఆగిపోయాయని, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఇదే ప్రాజెక్టును రీడిజైన్‌ పేరుతో రూ.18000 కోట్ల అంచనాలు పెంచారని, రూ.750 కోట్లు వెచ్చించి పనులు చేసినప్పటికీ ఒక్క ఎకరాకు చుక్కనీరు కూడా ఇవ్వలేదన్నారు. ఇంతకాలం పంపులు మోటార్లు ఫిట్‌ చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. పంపులు మోటార్లు పైపులు కొనుగోళ్ల ద్వారా కమీషన్‌ వస్తుంది కాబట్టి వాటినైనా కొన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసిఆర్‌ ప్రభుత్వం రూ.1లక్ష80 వేల కోట్లు వెచ్చించి ఆయకట్టు పెంచలేక పోవడం దుర్మార్గం అన్నారు. నీళ్లు కావాలని బిఆర్‌ఎస్‌ నాయకులు దీక్షలు చేస్తామని అనడం, నీళ్లు కావాలని అడగడం మావిశ్వసనీయతకు నిదర్శనం అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కేసిఆర్‌, హరీష్‌ రావు, కేటిఆర్‌ చేప్పేవన్నీ బోగస్‌ మాటలు కాబట్టి వారిని అడిగినా ఉపయోగం లేదని తెలుసుకుని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తమను నీళ్లు అడుగుతున్నారని, ప్రతీ ఎకరాకు నీరు అందింస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఖమ్మం జిల్లా రైతులంతా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పైనే ఆధారపడటం వల్ల ఇబ్బందిగా మారుతోందని, సీతారామ ప్రాజెక్టు నీటిని సాగర్‌ కాలువకు అనుసంధానం చేసి కృష్ణాజలాలు రాని రోజుల్లో కూడా అక్కడి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కృష్ణ, గోదావరిని కలపాలని సంకల్పం ఆనాటి సిఎం వైఎస్‌ఆర్‌ ది అని, కేసిఆర్‌ ఎంత గింజుకున్నా తమ వల్ల కాలేదని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే అది జరిగిందన్నారు. గోదావరి జాలలు తమ తలలను ముద్దాడి ఆశీర్వదించాయని చెప్పారు. హరీష్‌ రాపు మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం లేదని, సీతారామా జలాలను నెత్తిన చల్లుకుని పాపాలు కడుక్కోవాలని, ఇదే పని కేసిఆర్‌ కూడా చేయాలని, ఆయన రాలేకపోతే రెండు బాటిళ్లలో నీళ్లు పంపిస్తే ఎందులైనా కలుపుకుని పునీతుడు అవుతాడాని, తద్వారా జ్ఞానోదయమైనా అవుతుందని యద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌ తో కలిపి మొత్తం 674387 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భూమిల్లో గోదావరి జలాలు పారించేందుకు ఎంతంటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని, ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదలచేసి సీతారామా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నామని అయినప్పటికీ ఇంకా నిధులు కావాలంటూ పొంగులేటి, తుమ్మల అంటున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని, ప్రధానంగా ఫ్లోరైడ్‌ ఇబ్బంది ఉన్న నల్గొండ జిల్లాకు నిధులు కావాలని మంత్రి ఉత్తమార్‌ రెడ్డి అంటున్నారని, అదే విధంగా వలసల జిల్లా పాలమూరు జిల్లాలో కూడా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రతీ జిల్లాలో నీటి వనరులను పెంచి వ్యవసాయ ఆయకట్టు పెంచి తీరుతామని చెప్పారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కుటుంబ పాలన సాగిందని, ఇష్టాను సారంగా దోచుకునేందుకు అప్పుల కుంపటిగా మార్చారని, వారి చేసిన అప్పులకు ప్రతీ ఏటా రూ.6500 కోట్లు వడ్డీ రూపంలో కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ప్రాజెక్టు పేరుతో అనేక తప్పిదాలు చేశారని, వేల కోట్లు వెచ్చించి చుక్కనీరు కూడా ఇవ్వలేక పోవడం దుర్మార్గం అన్నారు. రైతులకు మాటిచ్చిన రీతిగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసితీరుతోందని,దానికి ఖమ్మం జిల్లా వేదికైందన్నారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్‌ రావు అన్నారని, రాజీనామా పత్రం సిద్ధ ం చేసుకోవాలని, లేదంటే వారి విజ్ఞతకే వదిలేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపి రామసహాయం రఘురామరెడ్డి, సిఎస్‌ శాంతి కుమారి, ఎంఎల్‌ఏలు జారే ఆదిన్నారాయణ, కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, డా.తెల్లం వెంకట్రావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పోరేషన్‌ చైర్మన్‌ మువ్వా విజయ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments