HomeNewsBreaking Newsప్రాజెక్టుల్లోకి… వరదల పరుగు

ప్రాజెక్టుల్లోకి… వరదల పరుగు

నిండుకుండల్లా జలాశయాలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకల
భద్రాచలానికి మరోసారి వరద ముప్పు
మెదక్‌ జిల్లాలో గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
వరంగల్‌ నగరంలో పురాతన భవనం కూలి ఇద్దరు దుర్మరణం
మూడు రోజులు భారీ వర్షాలు: భయాందోళనలో ప్రజలు
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌
రాష్ట్రంలో మళ్లీ మొదలైన వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతా ల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్న జలాశయాలు మళ్లీ నిండుకుండల్లా మారుతున్నాయి. ఇప్పటివరకు గోదావరికి వరదలు పోటెత్తి పరివాహక ప్రాంతాలు అల్లకల్లోలం కాగా, తాజాగా కృష్ణా నదికి, దానిపై ఉన్న ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతున్నది. కుండపోతగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రహదారులపై వరనీరు పారుతూ మినీ చెరువులుగా మారి పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెదక్‌ జిల్లాలో గోడ కూలి ఇద్దరు కార్మికులు, వర్షంలో బైక్‌ జారిపడి ఒకరు మృతి చెందారు. వరంగల్‌ నగరంలో పురాతన భవనం కూలి ఒకరు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు : హైదరాబాద్‌: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్‌లో సగటు వర్షాపాతం కంటే అత్యధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. రాగల నాలుగైదు వారాలు వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని తెలిపారు.
మెదక్‌ జిల్లాలో వర్ష బీభత్సం&
గోడ కూలి ఇద్దరు కార్మికులు, రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మెదక్‌ :
ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసిన వర్షానికి మెదక్‌ జిల్లా తడిసి ముద్దయింది. వర్షం ప్రభావంతో ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తూ జల ప్రళయంగా దర్శనమిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇల్లు లోకి నీళ్లు చేరాయి. భారీ వర్షానికి చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వర్షం సృష్టించిన బీభత్సావానికి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. సుమారు ఆరు నుంచి ఏడు గంటలు కురిసిన వర్షానికి రోడ్లన్నీ ధ్వంసమై కొట్టుకుపోయాయి. మెదక్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తూ సరాసరి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా పాతూరులో 26.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో చేగుంట మండలం రెడ్డిపల్లిలో లక్ష్మీ గణేష్‌ మినరల్స్‌ కంపెనీలో గోడ కూలి బీహార్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిని రన్‌ బెన్‌ యాదవ్‌ (50), వికారి యాదవ్‌ (45)గా గుర్తించారు. నార్సింగి వద్ద హైవే మీద భారీగా వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో నిజామాబాద్‌ నుంచి హైద్రాబాద్‌ వైపు బైక్‌పై వస్తున్న తోకల సాయిలు (19) అనే యువకుడి బైక్‌ జారిపడి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడిది నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నాగేపూర్‌గా గుర్తించారు. విదేశాలకు వెళ్లేందుకు మెడికల్‌ టెస్ట్‌ కోసం ఏజెంట్‌ హరుణ్‌ తో కలిసి హైద్రాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాపన్నపేట మండలం నాగ్సన్‌పల్లి ఊర చెరువు చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ లో అటవీ ప్రాంతంలో ఉన్న పటేల్‌ కుంట చెరువులు తెగిపోయాయి. ముతాయి కోట గ్రామంలో ఎం యన్‌ కెనాల్‌ తెగిపోయి వరద నీరు గ్రామం తోపాటు రోడ్డు మీద పారింది. భారీ వర్షాలకు రోడ్డు బ్రిడ్జి కొట్టుకుపోవడం, రోడ్లు తెగిపోడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగూరు నుంచి నీటిని దిగువకు వదలడంతో మంజీరా పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలోకి నడుము వరకు నీళ్లు వచ్చాయి. దీంతో ఆలయాన్ని మూసి వేశారు. జిల్లాలోని కొల్చారం, హవేలి ఘనపూర్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నిజాంపేట, టేక్మాల్‌, కౌడిపల్లి, నర్సాపూర్‌ మండలాల్లో దాదాపు 2,500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నర్సాపూర్‌, శివ్వంపేట, టేక్మాల్‌, నిజాంపేట, కౌడిపల్లి మండలాల్లో సుమారు 400 ఎకరాలలో పత్తి పంట దెబ్బతింది. మెదక్‌ పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. ఎంఎన్‌ కాలువ పొంగిపొర్లడంతో మెదక్‌ పట్టణంలోని వెంకట్‌ రావు నగర్‌ కాలనీ, సాయి నగర్‌ కాలనీ తో పాటు ప్రధాన రహదారి పై వరద నీరు భారీగా పారింది. దీంతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌ రెడ్డి నీట మునిగిన కాలనీలను జెసిబిపై వెళ్లి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బట్టి జగపతి, ఎంమున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి ఉన్నారు.
శ్రీరాంసాగర్‌ 18 గేట్లు, నిజాంసాగర్‌ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నిజామాబాద్‌:
భారీ వర్షాలు, వరదలకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో అధికారులు 18 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది ఎగువ ప్రాంతం నుండి సాయంత్రం వరకు 49,968 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 18 గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 90.3 టిఎంసిలకుగాను ప్రస్తుతం 75.456 టిఎంసిలకు చేరుకుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 10 టిఎంసిలకు గాను పూర్తిస్థాయి చేరుకోవడంతో అధికారులు 8 గేట్లు తెరిచి దిగువకు మంజీర నదిలోకి నీటిని వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రామడుగు, సింగీతం, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండల్లా మారాయి. జిల్లా యంత్రాంగం జిల్లాలోని చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరి అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టులకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని, నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు, గేదెల కాపరులు నది వైపు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.
ఎల్‌ఎండి పరివాహన ప్రాంత ప్రజలు అప్రమత్తం
కరీంనగర్‌:
వర్షాలకు కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యామ్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నందున మానేరు డ్యామ్‌ 4 స్పిల్‌ వే గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ఎల్‌ఎండి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌ఎండి నీటి సామర్థ్యం 24 టిఎంసిలు కాగా ప్రస్తుతం 21.5 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు. మానేరు నది పరివాహన ప్రాంతాలైన మానకొండూర్‌, వీణవంక తహసీల్దార్లు, ఎస్‌హెచ్‌ఓలు, ఆర్‌డిఓను, నది సమీపంలో ఉన్న, ప్రక్కన ఉన్న గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. గ్రామస్థులు, మత్స్యకారులు, పశువులు నదిలోకి ప్రవేశించకుండా రెవెన్యూ, పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.
మళ్లీ పెరుగుతున్న గోదావరి
భద్రాచలం:
భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం 45 అడుగుల నమోదైంది. ఈనెల 16వ తేదీన 71.03 అడుగుల వరకు ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 42 అడుగుల వద్ద నిలకడగా మారి శనివారం ఉదయం నుండి క్రమేపీ పెరుగుతోంది. ఎగువన తాలిపేరు నుండి నీరు దిగువకు విడుదల చేశారు. మరో మూడు అడుగుల వరకు పెరిగి తగ్గే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యూసి అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గోదావరి కరకట్టకున్న స్లూయిస్‌లు లీకు కావడంతో వరదనీరు కాలనీల్లోనికి ప్రవేశిస్తోంది. ఇరిగేషన్‌ శాఖ వేసవి కాలంలో సరైన మరమ్మత్తులు చేయకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రజలు అంటున్నారు. ఈ లీకు వల్ల ప్రస్తుతం అయ్యప్పకాలనీ, కొత్తకాలనీ, రెవెన్యూ కాలనీ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత కొద్దిగా రోజులుగా వరద నీటిలో మునిగి ఇల్లు ఇప్పుడిప్పుడే తేలుతుండటంతో ప్రజలు వాటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానల వల్ల గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సిబ్బందికి అన్ని రకాల సెలువులు రద్దు చేశారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తాలిపేరు 25 గేట్లు ఎత్తివేత:
ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మునిగిన ఓంకారేశ్వర ఆలయం
నిర్మల్‌ టౌన్‌ :
నిర్మల్‌ పట్టణంలోని వెంకటాద్రిపేట్‌లో గల అతి పురాతన ఓంకారేశ్వర ఆలయం (ఖజానా చెరువు) ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం రోజు నీట మునిగిపోయింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతమైన బంగల్‌పేట్‌, గుట్ట ప్రాంతం నుండి భారీగా నీరు రావడంతో చెరువు పూర్తిగా నిండి అలుగు పారింది. దీంతో ఆ నీరంతా ఖజానా చెరువులోకి రావడంతో ఆలయం నీటమునిగింది. ఈ వరద నీటితో ఆలయంలోని శివలింగంతోపాటు పరిసరాలన్నీ వరదనీటితో నిండిపోయాయి. గత 12 ఏళ్లలో ఇంత భారీ వర్షాలు పడడం ఇదే తొలిసారి అని పట్టణ ప్రజానీకం అంటున్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు వరదనీటితో నిండిపోయి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
మూసీ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
సూర్యాపేట : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా 12083.02 క్యూసెక్యుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరగా అధికారులు ఏడు గేట్లు ఎత్తి దిగువకు 25264.09 క్యూసెక్యుల నీటిని వదిలారు. మూసీ ప్రాజెక్ట్‌ నీటి సామర్ధ్యం 645 ఫీట్లు కాగా ప్రస్తుతం 640.90 ఫీట్లకు చేరుకుంది. వరద తకిడికితో ప్రాజెక్ట్‌ నుండి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ పరివాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీకి వరద తకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జంట జలాశయాలకూ వరద
భాగ్యనగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్‌, హిమాయత్సాగర్లకూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌ సాగర్‌ ఇన్‌ఫ్లో 2,100 క్యూసెక్కులు కాగా 6 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 1,788 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.95 అడుగులుగా ఉంది. హిమాయత్‌సాగర్‌కు 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1760.70 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో హుస్సేన్‌ సాగర్‌ మరోసారి గరిష్ఠ నీటి మట్టాన్ని తాకింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.43 మీటర్లు కాగా ప్రస్తుతం 513.70 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం దాటడంతో అధికారులు తూముల ద్వారా వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. వర్షం కొనసాగితే మరింత వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు.
వరదల్లో చిక్కుకున్న 23 మంది కూలీలలు సేఫ్‌
రాత్రి మొత్తం తరలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం
ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు, అధికారులు
మద్దిరాల :
వరినాట్లు వేసేందుకు వెళ్లి శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పొంగిపోర్లుతున్న మద్దిరాల మండలం జి.కొత్తపల్లి, ముకుందాపురం గ్రామాల మధ్య గల పాలేరు వాగు జంట పాయల మధ్యలో వ్యవసాయ పొలంలో చిక్కుకున్న 23 మంది కూలీలను ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి రాత్రి నుండి సహాయ చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం లోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం కొక్య గ్రామ పంచాయితీ చౌలపల్లి తండాకు చెందిన 23 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల ముకుందాపురం గ్రామంలో వరినాట్లు వేసేందుకు వచ్చారు. వారు కూలీపనిలో నిమగ్రమైన ఉన్న సందర్బంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో పాలేరు వాగు సాయంత్రానికి వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కూలీలు తిగిరి తమ ఇళ్లకు చేరుకోలేకపోయారు. కూలీలు వరద ఉధృతి పెరుగడంతో వాగు దాటలేక వాగు ఒడ్డున బిక్కుబిక్కుమంటూ వరద ప్రవాహాల మధ్య గల వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోయారు. కూలీలతో పాటు ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని స్ధానిక గ్రామ సర్పంచ్‌కు తెలియజేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కూలీలు పడుతున్న ఇబ్బందులు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్వయంగా కూలీలతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలను ఆదేశించారు. వెంటనే జిల్లా అధికారులు సంఘటన స్ధలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించాయి. కూలీలకు కావాల్సిన మంచినీళ్ళు, ఆహార పదార్ధాలను డ్రోన్‌ల సహాయంతో అందించారు. వాగు ఒడ్డున ఉన్న కూలీలను ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం రాత్రి 10గంటల నుండి శనివారం తెల్లవారుజామున 5గంటల వరకు శ్రమించి సురక్షిత ప్రాంతానికి తీసుకోచ్చారు. దీంతో వ్యవసాయ కూలీలు 23 మంది సురక్షితంగా గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎంతో ఆందోళనలో ఉన్న కుటుంబీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


పురాతన భవనం కూలి ఇద్దరు మృతి
వరంగల్‌ :
వరంగల్‌ నగరంలో గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం రాత్రి మండి బజార్‌లో ఓ పురాతన భవనం కూలిపోయి ఇద్దరు మరణించారు. మేయిన్‌ రోడ్డులోని మాడ్రన్‌ స్వీట్‌ హౌజ్‌, గ్రాంపస్‌ బేకరీ ఉన్న ఈ భవనం కూలి పక్కనే ఉన్న గుడిసెపై పడడంతో అందులో ఉన్న దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన పైడి(60) అనే వృద్దునితో పాటు తొర్రూరు మాటేడుకు చెందిన ఫిరోజ్‌ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. సలీమా అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఎంజిఎంకు తరలించారు. ఫిరోజ్‌కు రంగశాయిపేటకు చెందిన అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ ఉండడంతో అన్న, వదిన, చిన్న పాపతో నలుగురు శుక్రవారం సాయంత్రం వరంగల్‌కు వచ్చారు. నిశ్చితార్ధం కోసం వచ్చిన ఫిరోజ్‌ మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఎల్‌ఎలు నన్నపునేని నరేందర్‌, ఆరూరి రమేష్‌, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్యలు, రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌ తదితరులు వారు ఉన్న ఇంటిని, ఎంజిఎం ఆస్పత్రిలో ప్రమాదంలో మరణించిన మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో శిధిలావస్థలో ఉన్న 379 ఇండ్లను గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చామని, వాటిలో ఇప్పటికే 145 పురాతన ఇండ్లు కూల్చేశారన్నారు. నోటీసులు అందుకున్న యజమానులు వారే ఇండ్లను తొలగించుకోవాలని, లేకపోతే బల్దియా అధికారులే తొలగిస్తారని అందుకు ప్రజలు సహకరించాలన్నారు.

2 రోజులు సెలవులొద్దు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిలా ్లకలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని, వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్‌, రెవెన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments