అసెంబ్లీలో విరుచుకుపడిన సిఎం కెసిఆర్
మరో రెండు పథకాలున్నాయ్… తెచ్చామో మీపని ఖతం
త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం
ప్రజాపక్షం/ హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానాల వల్లనే దేశ ఆర్థిక పరిస్థితి ఈ స్థాయికి దిగజారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని 54 ఏళ్ళు కాంగ్రెస్, 11 సంవత్సరాలు బిజెపి పాలిస్తే ఆరేళ్లు ఇతర పార్టీలు పరిపాలించాయని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టిడి పి ప్రభుత్వాలే సుదీర్ఘకాలం పాలించాయని, పదే పదే అప్పుల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు అవగాహన లేక, నీటి పరిజ్ఞానం లేక విమర్శలు చేస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆదివారం ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ముఖ్యమంతి కెసిఆర్ సమాధానమిచ్చారు. నీటి లభ్యత లేని చోట్ల ప్రాజెక్టు కట్టమంటారా అని సిఎం ప్రశ్నించారు. మేడి గడ్డ వద్ద నీటి లభ్యత ఉందని సిడబ్ల్యుసి నిర్దారించిన తర్వాతే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అప్పులు తేకుండా మీ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా కట్టా రా అని ప్రశ్నించారు. ఢిల్లీ నాయకత్వానికి తలొం చి నందికొండను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఉన్న తెలంగాణను నాశనం చేసింది కాం గ్రెస్ అని మండిపడ్డారు. ప్రాజెక్టుల మీద కేసులు పెట్టి ఉద్యోగ ప్రకటనల మీద స్టేలు తెచ్చి కాం గ్రెస్ నాయకులు 900 కేసులు వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చి తప్పు చేశామని జానారెడ్డి అంటారని, తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామని బలరాంనాయక్ అంటారని, భవిష్యత్లో ఆంధ్రా తెలంగాణ కలిసే అవకాశం ఉందని ఎంపి జైరాం రమేశ్ అంటారని విమర్శించారు. ‘బడాభాయ్ బడాభాయ్.. చోటాభాయ్ సుభాన్ అల్లా’ అన్నట్టుంది కాంగ్రెస్, బిజెపి పరిస్థితి అని ముఖ్యమంత్రి అన్నారు. బిజెపి ప్రభుత్వం శుష్క ప్రియులు శూన్యహస్తాలు తప్ప తెలంగాణగా చేసేందేమీ లేని దుయ్యబట్టారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు ఇవ్వడం లేదని, వెను కబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇవ్వాలి కానీ, ఇవ్వడం లేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వలేదని ముఖ్యమంత్రి అన్నారు. బిజెపి హడావుడి చేస్తోందని, ఆ పార్టీ వచ్చి రైతులకు కిరీటాలు పెడుతుందా అని ప్రశ్నించారు. ఒక్క బిజెపి పాలిత రాష్ట్రంలోనైనా రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు. మాట్లాడితే అప్పులు అంటున్నారని, నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పిపై అప్పులు తేలేదా అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న ఈ దుస్థితికి ఎవరి విధానాలు కారణమని నిలదీశారు. మన పక్కనే ఉన్న చైనా ఎక్కడిదాకా పోయింది. మనం ఎక్కడ ఉన్నాం. గుండెల మీద అణుబాంబులు వేసుకున్న నాగసాకి ఎక్కడికి పోయింది. అంటూ కాంగ్రెస్, బిజెపిలను నిలదీశారు. తాను లేకపోతే, తాను జెండా ఎగరేయకపోతే మీ చరిత్ర ఎవరూ చెప్పేవారు కాదని కెసిఆర్ అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటే.. ఇదే భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా ఈ కుర్చీలోనే ఉన్నా రు కదా? తెలంగాణకు నిలువునా అన్యాయం జరుగుతుంటే శ్రీధర్‌బాబు మంత్రిగా ఇక్కడే కూర్చోలేదా? కాంగ్రెస్ హయాంలో మైనార్టీలను గోల్‌మాల్ చేయడం తప్ప ఏమీ జరగలేదు. కాంగ్రెస్ హయాంలో సగానికి సగం జనాభా ఉన్న బిసిలకు అన్యాయం జరిగింది. వారి కోసం ఒక మంత్రిత్వశాఖను కాంగ్రెస్, బిజెపి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు రెండూ దొందు దొందే అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను కేంద్రం దగ్గర ఉంచుకోవద్దని మేం కోరామని, జిఎస్‌టి విషయంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కొట్లాడిందని కెసిఆర్ అన్నారు.