బత్తాయి రైతుల బాధ్యత ముఖ్యమంత్రి కెసిఆర్‌దే
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కెసిఆర్ ఆరోపణలు అవాస్తవం
పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
కరీంనగర్ జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ప్రజాపక్షం / కరీంనగర్ బ్యూరో: రైతుల విషయంలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వకుండా సిఎం కెసిఆర్ బూతు మా టలతో తిట్టారని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. బత్తాయి తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుందని చెప్పి బిజినెస్ జరగకుండా రాష్ట్రంలోనే ఆపారని, ఇప్పుడు బత్తాయి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, దీనికి సిఎం కెసిఆర్‌దే బాధ్యత అని అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉత్తమ్ పరిశీలించారు. సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా 25 శాతం మాత్రమే కొన్నారని, ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యమని ఆరోపించారు. గన్నీ సంచుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. 42 కిలోల ధాన్యాన్ని 40 కిలోలకే కొనుగోలు చేస్తూ 2 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు. మిల్లులోకి వెళ్ళాక మరో రెండు కిలోలు తీసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఓ అధికార పార్టీ నాయకుడు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల పంట కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తెలంగాణ కంటే మెరుగ్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులను మిల్లర్లు దోచుకుంటే జిల్లాలో ఉన్న పౌరసరఫరా శాఖ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. రైతులతో సంతకాలు పెట్టించుకుంటూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జెడ్‌పి మాజీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్, చల్మెడ లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే… తిడతారా?
RELATED ARTICLES