HomeNewsBreaking Newsప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు!

ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు!

ప్రతిపక్షం లేకుండా కెసిఆర్‌ కుట్ర
అవినీతి డబ్బుతో ఎంఎల్‌ఎల కొనుగోలు
వీర తెలంగాణ అప్రతిష్ట తెలంగాణగా మారింది
ఫిరాయింపులపై ఐక్య ఉద్యమం
అఖిలపక్ష సమావేశంలో నేతల నిర్ణయం
హైదరాబాద్‌ : ప్రశ్నించే గొంతులు, ప్రతిపక్షం ఉండకుండా కెసిఆర్‌ కుట్ర పన్నుతున్నారని అఖిలపక్షనేతలు విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రభుత్వ అవినీతి బట్టబయలు అవుతుందని, అందుకే అవినీతి డబ్బులతో ఎంఎల్‌ఎలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్‌ పాలన సాగుతోందని, పార్టీ ఫిరాయింపులపై కలిసికట్టుగా ఉద్యమించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ ఫిరాయింపులపై శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు చాడ వెంకట్‌ రెడ్డి , డాక్టర్‌ సుధాకర్‌ (సిపిఐ), ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టిడిపి), ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు (టిజెఎస్‌), వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌ (కాంగ్రెస్‌), డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటిపార్టీ) ప్రజాగాయకుడు గద్దర్‌, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య (టి.మాస్‌), నాగరాజు (తెలంగాణ లోక్‌సత్తా) తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులపై త్వరలో కా ర్యాచరణ రూపొందించాలని అఖిలపక్షం నిర్ణయించిం ది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతుందన్నారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి తీసుకుని 10వ షెడ్యూల్‌ను తుంగలో తొక్కుతున్నారన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ పట్టించుకోవడం లేదన్నారు. డబ్బులు ఇచ్చి ఎంఎల్‌ఎలను కొనుగో లు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను ఎంఎల్‌ఎల కొనుగోలు చేయడానికి వాడుతున్నారని ఆరోపించారు. రీ డిజైనింగ్‌ పేరుతో అవినీతికి పాల్పడిన డబ్బుతోనే ఎంఎల్‌ఎలను కొనుగోలు చేస్తున్నారన్నారు. త్యాగా ల లక్ష్యాలు నెరవేరాలంటే ప్రజాస్వామ్యం బతికి ఉండాలని, పార్టీ ఫిరాయింపుల చట్టం దేశవ్యాప్తంగా ఉద్యమించాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వీర తెలంగాణను అప్రతిష్ట తెలంగాణగా మారుస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ బూర్జువా విధానాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో తాము టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయబోమని చెప్పినందుకే తమ పార్టీకి చెందిన ఒక ఎంఎల్‌ను టిఆర్‌ఎస్‌లో కలుపుకున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీలో కూడా కెసిఆర్‌ అనేక చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల ఎంఎల్‌ఎ సభ్యత్వాలను యధావిధిగా కొనసాగించాలని హై కోర్టు తీర్పునిచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కేసు విషయంలో అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఒక రోజు శిక్ష అనుభవించారని, ఇప్పటికైనా కెసిఆర్‌కు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, పాలకుల చేతిలో ప్ర జాస్వామ్యం కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఉండకూడదని, ప్రశ్నించే గొంతులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఉద్యమించాలన్నారు. టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం నెలకొన్నదని, అందుకే ఇతర పార్టీల ఎంఎల్‌ఎలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతున్న వారే, రేపు మరో బలమైన శక్తి కనిపిస్తే కెసిర్‌ను వదిలి వెళ్తారని, అప్పుడు పేకమేడ కూలుతుందన్నారు. కెసిఆర్‌ ఒంటరిగా నిలబడే పరిస్థితి వస్తుందని, ఆ సమయంలో కెసిఆర్‌ తరపున కొట్లాడేవారే ఉండరని వ్యాఖ్యానించారు. గత శాసనసభ లో పార్టీలు మారిన వారిలో కొందరికి డబ్బులు ఇవ్వకుండా రూ.400 కోట్ల మేర కాంట్రాక్టులను అప్పగించారని ఆరోపించారు. ఎంఎల్‌ఎలకు సంపదపై ఆశలు ఉంటే ప్రభుత్వం అక్రమార్జనకు దారి తీస్తుందన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, సిద్ధాంతాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ మాట్లాడుతూ నాడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వారిని ప్రజలు చీరి చింతకు కడుతారని చెప్పిన కెసిఆర్‌, ఇప్పుడు ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో 14 మంది ఎంపి లు ఉన్నప్పటికీ విభజన హామీలను సాధించలేకపోయారని, ఆ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే 16 ఎంపిలను గెలిపిస్తే ఢిల్లీలో శాసిస్తామనడం విడ్డూరంగా ఉందన్నా రు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న ఎంఎల్‌ఎ నియోజకవర్గాల్లో సిఎం కెసిఆర్‌ అభివృద్ధి పనులు చేయరా..? ఎందుకు ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు చేస్తున్న ఎంఎల్‌ఎల లేఖలన్నీ ఒకే తరహా ఉంటాయన్నారు. బలహీనవర్గాల వ్యక్తి సిఎల్‌పి నేతగా ఉంటే ఓర్చుకోలేకపోవడమే గుణాత్మక మార్పా అని ప్రశ్నించారు. పార్టీఫిరాయింపులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలన్నారు. టి మాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య మాట్లాడుతూ ఒక దళితుడు ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం సిఎం కెసిఆర్‌ ఓర్చుకోలేకోతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి నాయకులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన అవరం ఉందన్నారు. టిఆర్‌ఎస్‌లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఎంఎల్‌ఎలు బయకు వచ్చి అందరూ ఏకం కావాల్సిఉండేనన్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ రాష్ట్రంలో నియో ఫ్యూడలిజం చూపిస్తున్నారన్నారు. 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని చెప్పారు. 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో కెసిఆర్‌ ఎలా పాలన చేస్తారో స్పష్టం చేయాలన్నారు. కెసిఆర్‌కు వినతిపత్రం ఇస్తానంటే తనకు కనీసం 5 నిమిషాల సమయాన్ని కూడా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగాన్ని భస్మం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సనాత సాంప్రదాయాల ఉగ్రవాదానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికే అవకాశం ఉంటుందన్నారు. మాజీ ఎంపి వి.హనుమంతరావు మాట్లాడుతూ కెటిఆర్‌ సిఎం అయిన తర్వాత టిఆర్‌ఎస్‌ నుంచి తిరిగి వలసులు రాకపోతే తన పేరు హనుమంతరావే కాదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments