గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే
రాజమండ్రి-హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరం
ప్రధాన పట్టణాలకు అనుసంధానం
భూ సేకరణపై అంగీకారానికి రాని రైతులు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో ఖమ్మం, దేవరపల్లి, (పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. రోడ్‌మ్యాప్ తయారు కావడంతో భూసేకరణ ప్రారంభమైంది. 162.67 కిలో మీటర్ల మేర నిర్మించే ఈ హైవే ఖమ్మం, సూర్యాపేట మధ్య సూర్యాపేట నుంచి 58 కిలో మీటర్ల తర్వా త తల్లంపాడు వద్ద ప్రారంభమవుతుంది. 70 మీటర్ల వెడల్పున సాగే ఈ రహదారి నిర్మాణానికి సుమారు 571 ఎకరాల భూమి అవసరమవుతుంది. గతంలో సూర్యాపేట, ఖమ్మం మధ్య ఉన్న రాష్ట్రీయ రహదారిని నాలుగు వరుసల్లో నిర్మిస్తూ జాతీయ రహదారిగా మార్చి దీనికి అనుసంధానం చేయనున్నారు. ఖమ్మం, సూర్యాపేట మధ్య రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఖమ్మం, వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డి గూడెం పట్టణాలకు సమీపం నుంచి వెళ్లనుంది. రూ. 4,609 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నిర్మాణంలో ఒక ఆర్‌ఒబి, తొమ్మిది పెద్ద వంతెనలు, 51 చిన్న వంతెనలు, ఎనిమిది టోల్‌ప్లాజాలు నిర్మించనున్నారు. మూడు జిల్లాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలకు అనుసంధానం చేయడం వల్ల ప్రయాణం సులువు అవుతుంది. రాజమండ్రి, హైదరాబాద్ మధ్య 50 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడనుంది.
రైతులకు శాపం :
గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదన వచ్చిన నాటి నుండి ప్రతిపాదిత ప్రాంత రైతుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మంజిల్లాలోని వ్యవసాయ భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. 2014కు ముందు.. తర్వాత అన్నట్లుగా భూముల ధరల గురించి మాట్లాడుకోవాలి. మారుమూల గ్రామాల్లో సైతం వ్యవసాయ భూముల ధరలు రూ. 25 లక్షల పైమాటే. పట్టణాలు, నగరాలకు సమీపంలో కోటి రూపాయలకు తక్కువలో వ్యవసాయ భూమి లేదు. జాతీయ రహదారి ప్రతిపాదిత ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుమీదున్న ప్రాంతం కావడంతో భూ సేకరణ పెద్ద సమస్యగా మారింది. చింతకాని మండలం కోదుమూరులో హైవే ప్రతిపాదిత ప్రాంతానికి దగ్గరలో ప్రైవేటు వ్యక్తులు ఎకరం రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రైవేటు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఎకరం కోటి రూపాయలకు ఖమ్మం సమీప గ్రామాల ప్రజలు అంగీకరించగా, మిగిలిన చోట రూ. 50 లక్షలకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన భూ విలువ ప్రకారం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. ఎన్ని రెట్లు ఇస్తే ప్రస్తుత మార్కెట్ విలువకు సరిపోతుందో అధికారులే అంచనా వేయాల్సి ఉంది. హైవే నిర్మాణం అటు ఉంచి భూ సేకరణే ప్రధాన సమస్యగా మారుతుంది. హైవే నిర్మాణం రైతులకు శాపంగా మారకుండా అధికారులు తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రయాణికులకు వరం.. రైతులకు శాపం
RELATED ARTICLES