ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, నాటి నిజాం సంస్థానంలో రాచరిక, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఆల్ హైదరాబాద్ స్టూడెండ్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నర్సింగ్‌రావు (89) కరోనా వైరస్ బారిన పడి మరణించారు. గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో కొవిడ్‌కు చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆయనకు పెదనాన్న అవుతారు. ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎఐఎస్‌ఎఫ్)కు బూర్గుల నర్సింగ్‌రావు అధ్యక్షులుగా కూడా పని చేశారు. తన పెద నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నర్సింగ్‌రావుకు భార్య డాక్టర్ మంగుతా, కుమార్తె మాళవిక, ఇద్దరు కుమారులు అజయ్, విజయ్‌లు ఉన్నారు. హైదరాబాద్‌లోనే సోమవారం మధ్యాహ్నం బూర్గుల నర్సింగ్‌రావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా పాల్గొన్నారు. సురవరం, చాడ, పలువురు సంతాపం : తెలంగాణ సాయుధ పోరాట యోధులు బూర్గుల నర్సింగ్‌రావు మృతి పట్ల సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, ఆరుట్ల ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆరుట్ల సుశీల తదితరుల వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలియజేశారు. బూర్గుల నర్సింగ్‌రావు లౌకికవాదం, ప్రజాస్వామ్యం, శాస్త్రీయ దృక్ఫథం వైపు తుది శ్వాస వరకు దృఢంగా నిలిచారని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తొలినాళ్ళల్లో బొంబాయిలో సిపిఐ కేంద్ర కార్యాలయం ఉండగా, అక్కడ పని చేశారని గుర్తు చేశారు. అత్యంత సంక్షోభ సమయంలో నిజాం రాచరిక పాలనపై జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనాలని ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా బూర్గుల పిలుపునిచ్చారని తెలిపారు. ప్రముఖ కమ్యూనిస్టు రావి నారాయణరెడ్డికి అత్యంత సన్నిహితులని, ఆయన మరణానంతరం రావి నారాయణరెడ్డి ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల ట్రస్టుల వ్యవస్థాపకులుగా ఉన్నారన్నారు. వయసు మీదపడినప్పటికీ చురుకుగా ఉండేవారని, లక్నోలో జరిగిన ఎఐఎస్‌ఎఫ్ 75వ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. బూర్గుల నర్సింగ్‌రావుకు నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు సురవరం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాయుధపోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన బూర్గుల నర్సింగ్‌రావు మరణం తెలంగాణతో పాటు, భారతదేశానికి తీరని లోటు అని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి అంచలంచెలుగా ఎదుగుతూ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్‌కు నాయకత్వం అందించారని కొనియాడారు. అదే విధంగా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కె.టి.రామారావు, ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు బూర్గుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నిజాం నిరంకుశ పాలనపై తిరగబడిన తెలంగాణ రైతు బిడ్డ, సిపిఐ సీనియర్ నాయకులు బూర్గుల నర్సింగ్‌రావు మరణం తెలంగాణ ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు పంచే రాజకీయాలకు నర్సింగ్‌రావు స్పూర్తి ఎంతో అవసరమని, నేటి యువత ఆయన బాటలో నడవడమే సరైన, ఘనమైన నివాళి అవుతుందని చెప్పారు. స్వాతంత్య్ర సమర యోథులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు బూర్గుల నర్సింగ్‌రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బూర్గుల మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎఐటియుసి ఆధ్వర్యంలో నివాళి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బూర్గుల నర్సింగ్ రావుకు ఎఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణించిన వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో నర్సింగ్ రావు చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.యస్.బోస్ మాట్లాడుతూ నైజాం రాచరిక వ్యవస్థపై తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులకొరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను వందేమాతరం ఉద్యమాలకు ఆకర్షితులై ఆల్ హైద్రాబాద్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారని తెలిపారు. ప్రస్తుతం వారు తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు చైర్మన్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నరసింహా, ఎఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యం.డి.యూసుఫ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యం.నర్సింహ్మా, నగర నాయకులు బొడ్డుపల్లి కిషన్, హాసీనాబేగం, ఎఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు హరికృష్ణ, నాయకులు డి.సంతోష్, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నేడు బూర్గుల నర్సింగ్‌రావు సంతాప సభ
ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధులు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షులు బూర్గుల నర్సింగ్ రావు సంతాప సభ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మగ్దూం భవన్లో నిర్వహించనున్నారు. సంతాప సభలో వామపక్ష పార్టీల నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొంటారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బూర్గుల నర్సింగ్‌రావు మృతి
RELATED ARTICLES