బెంగళూరు: ప్రముఖ రచయిత, నటుడు, జ్ఞానపీఠగ్రహీత గిరీశ్ కర్నాడ్ సోమవారం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా ఆయన సాహిత్యం, థియేటర్, సినిమా రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన అనేక సమస్యలపై నిర్భయంగా గళం ఎత్తేవారు. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేవారు. మరణించే సమయానికి కర్నాడ్ వయసు 81 ఏళ్లు. ఆయనకు భార్య సరస్వతి, పాత్రికేయుడు, రచయిత అయిన కుమారుడు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డారని ఆయన కుమారుడు రఘు తెలిపారు. ఆయన నిద్రలోనే ఉదయం 8.30 గంటలకు చనిపోయారని, ఆయన శ్వాసకోశ వ్యాధే ఆయన్ని తీసుకుందని చెప్పారు. అభిమానులలో, శ్రేయోభిలాషులలో ఆయన జ్ఞాపకాలుచిరకాలం నిలిచి ఉంటాయని ఆశిస్తున్నట్లు కూడా రఘు చెప్పారు. బాల్యం నుంచే గిరీశ్ కర్నాడ్ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యాధికుడైన కర్నాడ్ ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి కళలకే అంకితమయ్యారు. ఆయన ధార్వాడ్‌లోని కర్నాటక ఆర్ట్ ్స కాలేజీలో గణితశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. తరువాత ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫిలాసపీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ అభ్యసించారు. 1963లో ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఏడేళ్ల పాటు ఆక్స్‌ఫర్డ్‌లోనే ఉన్నారు. తరువాత అమెరికా చేరుకుని యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో చదువుకున్నారు. అనంతరం భారత్ తిరిగి వచ్చి, చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో ఉద్యోగంలో చేరారు. అక్కడ తన రచనావ్యాసంగాన్ని కొనసాగించడంతోపాటు థియేటర్‌పై కూడా దృష్టి పెట్టారు. తరువాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమాలవైపు మళ్లారు. ‘నవ్య’ సాహిత్య ఉద్యమంలో ఆయన బాగా ప్రసిద్ధులు. ‘యయతి’, ‘తుగ్లక్’, ‘అంజు మల్లిగె’, ‘అగ్నిమతు మాలె’, ‘నాగ మండల’, ‘హయవదన’, తదితర నాటకాలు గిరీశ్ కర్నాడ్‌కు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. గిరీశ్ కర్నాడ్ తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’, ‘కొమరంపులి’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన మాతృ భాష కన్నడ. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన సినిమాల్లో ‘సంస్కార’, ‘నిశాంత్’, ‘మంథన్’, ‘టైగర్ జిందా హై’, ‘శివాయ్’ చెప్పుకోతగ్గవి. ‘మాల్గుడీ డేస్’ అనే ప్రసిద్ధ టెలివిజన్ సీరియల్‌లో ఆయన స్వామి తండ్రిగా నటించారు. ‘ఇంద్ర ధనుశ్’లో ఆయన అప్పుకు తండ్రిగా నటించారు.
గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం కల్‌పలి విద్యుత్ స్మశానవాటికలో పూర్తయ్యాయి. ఆయన కోరిక మేరకు అంత్యక్రియల్లో ఎలాంటి మతాచారాలు, ప్రభుత్వ గౌరవాలు ఆమోదించకూడదని ఆయన కుటుంబసభ్యులు నిర్ణయించారు. గిరీశ్ కర్నాడ్‌కు కర్నాటక మంత్రులు డికె శివకుమార్, ఆర్‌వి దేశ్‌పాండే, అలాగే బి జయశ్రీ, సురేశ్ హెబ్లికర్ సహా అనేక మంది సినిమా ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. కర్నాడ్ గౌరవార్థం ముఖ్యమంత్రి కార్యాలయం మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ గిరీశ్ కర్నాడ్ అస్తమయంపై సంతాపం తెలిపారు. ఆయన సేవలు కొన్నేళ్లపాటు గుర్తుండిపోతాయన్నారు. మోడీ తన ట్విట్టర్‌లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి అయితే ‘మేము సాంస్కృతిక రాయబారిని కోల్పోయాం’ అన్నారు. ‘బిజెపి, దాని మిత్రపక్షాలకు ఓటేయొద్దు’ అని రాసిన లేఖలో ఆయన సంతకం చేశారు. భారత్, రాజ్యాంగం ముప్పులో ఉన్నాయని కూడా వాదించారు. భారత్‌లోని ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నోబెల్ గ్రహీత విఎస్ నైపాల్‌ను కూడా కర్నాడ్ విమర్శించారు. టిప్పు జయంతిని నిర్వహించాలనుకున్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయానికి కూడా ఆయన మద్దతు పలికారు. మితవాద ముఠా హిట్‌లిస్ట్‌లో గిరీశ్ కరాడ్ ఉండేవారని, ఆ ముఠా ఇదివరకే పాత్రికేయురాలు గౌరి లంకేశ్‌ను హత్య చేసిందని ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) అభిప్రాయపడింది.
ప్రముఖ రచయిత, నటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత
RELATED ARTICLES