ప్రజాపక్షం / హైదరాబాద్ ప్రముఖ బ్యూరోక్రాట్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నరేంద్ర లూథర్ (88) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాలు విరగడంతో గత కొంతకాలంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య బింది, కుమార్తె సంధ్య, కుమారుడు రాహుల్ ఉన్నారు. లూథర్ భౌతికకాయానికి మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. నరేంద్ర లూథర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనకు హైదరాబాద్ నగరం, సంస్కృతి, చరిత్రపై సాధికారత ఉంది. హైదరాబాద్ చరిత్రపై ఆయన రచించిన ‘హైదరాబాద్: ఎ బయోగ్రఫీ’ ఎంతో ప్రసిద్ధిగాంచింది. అందులో 1591లో హైదరాబాద్ నగరానికి పునాది వేసినప్పటి నుండి నాలుగు వందల సంవత్సరాల చరిత్రను ఆయన సవివరంగా రచించారు. నరేంద్ర లూథర్ పంజాబ్ హోషియార్‌పూర్‌లో 1932లో జన్మించారు. 1955లో ఆయన ఐఎఎస్ ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. అనంతరం 1959లో హైదరాబాద్ నగరంలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుండి నగరంపై మమకారం పెంచుకొని, ప్రతి అంశాన్ని క్షుణంగా అధ్యయనం చేశారు. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యారు. అనంతరం నగరంలో చెరువులు, గుట్టల పరిరక్షణకు ఉద్యమించారు. హైదరాబాద్ చరిత్ర, సంస్కృతికి సంబంధించి అందరూ అంగీకరించిన చరిత్రకారుడు. దీనిపై అనేక పుస్తకాలు రచించారు. ఉర్దూలో కూడా అనేక పుస్తకాలు రాశారు. పంజాబ్‌కు చెందిన నరేంద్ర లూథర్ అసలు పేరు నరీందర్ లూథర్ కాగా, వ్యవహారికంలో నరేంద్ర లూథర్‌గా మారారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన వివిధ హోదాలలో పనిచేశారు. నరేంద్ర లూథర్‌కు శిలలపై ఆప్యాయిత ఎక్కువ. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెం. 12లో ఆయన గృహం ఒక శిలల సముదాయం. ఎత్తయిన ఒక శిలను చ్ఛేదించకుండా ఆయన తన స్వగృహంలో హాలును 25 అడుగుల ఎత్తులో కట్టి చూడ ముచ్చటగా రూపొందించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులకు ఆయన ప్రేమ పాత్రుడు. తెలంగాణ ప్రముఖ ఉర్దూ సాహిత్యవేత్తను, రచయితను, చరిత్రకారుడిని కోల్పోయింది.
సిఎం సంతాపం : నరేంద్ర లూథర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర, సంస్కృతి విషయంలో ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా గుర్తు చేశారు. లూథర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖ చరిత్రకారుడు, బ్యూరోక్రాట్ నరేంద్ర లూథర్ మృతి
RELATED ARTICLES