HomeNewsTelanganaప్రమాణాలను కాపాడుకోవాలి

ప్రమాణాలను కాపాడుకోవాలి

జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి పిలుపు
నిష్పక్షపాతంగా, కఠినంగా వ్యవహరించకపోతే నిజమైన జర్నలిస్టులకు నష్టం
జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం, హెల్త్‌కార్డు, అక్రిడిటేషన్‌కార్డులు
మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సంపాదకులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి అన్నా రు. నిష్పక్షపాతంగా, కఠినంగా వ్యవహారించకపోతే వృత్తిలో ఉన్న నిజమైన జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని, ఈ విషయంపై సీనియర్‌ జర్నలిస్టులతో, అన్ని జర్నలిస్టుల సంఘాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. పనిచేసే వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం, హెల్త్‌కార్డు, అక్రిడిటేషన్‌కార్డు ఉండాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నారన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సొసైటీ సమస్యలను ముందుగా పరిష్కరించుకుని, ఆ తర్వాత మిగతా వాటి పరిష్కారానికి ముందుకెళ్తామని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ని దేశోద్దారకభవన్‌లో గల సురవరం ప్రతాపరెడ్డి హాల్‌లో గురువారం పదవీబాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌, ఇంటి స్థలం, హెల్త్‌ కార్డు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జర్నలిస్టుల అవసరాలు, వారికి అందాల్సిన సంక్షేమం గురించి పూర్తిగా అవగాహన ఉందని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తనను చైర్మన్‌ గా నియమించిన ముఖ్యమంత్రిని రెండు రోజుల కింద కలసి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్న దని తెలిపారు. హైదరాబాద్‌ లోని జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ సభ్యులు ఒక్కొక్కరు తమకు రావలిసిన ఇళ్ల స్థలాల కోసం 17 సంవత్సరాల కింద రూ.2 లక్షలు కట్టారని, వారికి ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. గత 17 ఏళ్లలో దాదాపు 60 మంది జర్నలిస్టులు ఇంటి స్థలాలు అందకుండానే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒకే చోట కాకుండా నగరానికి నాలుగు వైపుల గుర్తించి ఎవరికి ఎక్కడ ఇష్టముంటే అక్కడనే ఇస్తే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన గత ముఖ్యమంత్రులు నేదురమల్లి జనార్ధన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌ కార్డులు అన్ని ఆసుపత్రులలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. లేదా గతంలో మాదిరిగా జర్నలిస్టులు కూడా కొంత సొమ్మును హెల్త్‌ కార్డు కోసం చెల్లించి మంచి చికిత్స అన్ని ఆసుపత్రులలో పొందే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి బొరెడ్డి అయోధ్యరెడ్డి జర్నలిస్టు పక్షపాతి అని, ఆయన సహకారంతో జర్నలిస్టులకున్న సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తానని అన్నారు. పత్రికా విలేకరులు జర్నలిజం ప్రమాణాలను పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ప్రతీ మీడియా యాజమాన్యానికీ విధానం ఉండాల్సిందేనని, అదే సమయంలో అవాస్తవాలను రాస్తామంటే ప్రజలు క్షమించబోరని, దీనిని యజమాన్యాల పాలసీ అని జర్నలిస్టులు చెబితే, అందరూ ఇక యాజమాన్యాలతోనే మాట్లాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రయోజనాలను నెరవేర్చడంలో అందరూ ముందుడాలని సూచించారు. పత్రిక, జర్నలిస్టుల స్వేచ్ఛను పునరుద్ధరిద్దామన్నారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నది కనుక విలేకరులు జాగ్రత్తగా రిపోర్టింగ్‌ చేసి ప్రజల పక్షపాతిగా పనిచేయాలన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే అడ్వకేట్‌ జనరల్‌ సలహాతో పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారని అన్నారు. మీడియా అకాడమీకి కావాల్సిన బడ్జెట్‌, కార్యాలయానికి కావాల్సిన భవనం, అవసరమైన సిబ్బంది, అన్ని సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని తెలిపారు. సోషల్‌ మీడియా ప్రమాదకరంగా మారిందని, అయితే సోషల్‌ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు. నాణానికి రెండువైపులా ఉన్నట్టు సోషల్‌ మీడియాలో మాట్లాడలేని అసభ్య పదజాలం వస్తున్నదని, దీనిని సహించరాదన్నారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను మీడియా కౌన్సిల్‌గా మార్చాలని 15 ఏళ్లుగా తాము డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఏర్పాటులో శ్రీనివాస్‌రెడ్డి క్రీయశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మిగతా రాష్ట్రాలలో ఉన్న ప్రెస్‌ అకాడమీ పనితీరును పరిశీలించి, కార్యాలయ ఏర్పాటు నుండి పనితీరును, నిబంధనలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డారన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ హౌజింగ్‌ సొసైటీ స్థలం విషయమై సుప్రీంకోర్ట్‌ తీర్పు వెలువడినప్పటికీ గత ప్రభుత్వ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. మీడియా అకాడమీకి రూ.100 కోట్లు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. అక్రిడిటేషన్‌ కార్డుల బాధ్యత సమాచార శాఖదే అయినప్పటికీ ఆబాధ్యతను మీడియా అకాడమీకి ఇచ్చారన్నారు. అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇంటి సమస్య పరిష్కరానికి నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్‌ సంపాదకులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ జర్నలిస్టల ఇంటి స్థలాలు మొదటి కర్తవ్యంగా ఉండాలని, ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉందన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే యోగ్యత గత టిడిపి, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు లేకుండాపోయిందన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మీడియా అకాడమీని ఒక ప్రొఫెషనల్‌ బాడీగా తీర్చిదిద్దాలని శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. జర్నలిస్టుల సమస్యలను శ్రీనివాస్‌రెడ్డి పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సియాసత్‌ సంపాదకులు అమెర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘం తరపున శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్‌ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం మొదట గద్దర్‌ను గుర్తించి ఆ తర్వాత అందెశ్రీని, ప్రస్తుతం జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి గుర్తించడమంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తిస్తున్నట్టుగా ఉందన్నారు. ఒక జర్నలిస్టుగా ‘విశాలాంధ్ర’లోనే పుట్టి, ‘ప్రజాపక్షం’ వరకు ఒకే సంస్థలో జీవితాంతం పనిచేయడం శ్రీనివాస్‌రెడ్డి నిబద్దతకు నిదర్శనమన్నారు. నవ చేతన విజ్ఞాన సమితి చైర్మన్‌ పల్లా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదర్శప్రాయుడన్నారు. విభిన్న భావజాలం, విధానాలు కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులతో శ్రీనివాస్‌రెడ్డికి సంబంధాలు ఉన్నప్పటికీ తన కమ్యూనిస్టు భావజాలాన్ని మాత్రం విస్మరించలేదన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రమాణాలను పెంచాలని ఇందుకు తామంతా శ్రీనివాస్‌రెడ్డికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ అధ్యయన వేదిక కన్వీనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, ఎపియుడబ్యుజె అధ్యక్షుడు చందు జనార్ధన్‌, విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు చావ రవి, తెలంగాణ ఫోటో జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.నరహరి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఎ.మాజిద్‌, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, చిన్న వార్తా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్‌ బాబు, హిందీ విలేకరుల సంఘం అధ్యక్షుడు నాగశేషకుమార్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీనివాస్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టియుడబ్ల్యుజె) అధ్యక్షుడు కె.విరాహత్‌ అలీ సభాధ్యక్షత వహించారు.
ఆర్థిక సాయం చెక్కు అందజేత
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్దారక భవన్‌లో గల సురవరం ప్రతాప్‌రెడ్డి హాల్‌లో గురువారం పదవీబాధ్యతలను స్వీకరించారు.ఇటీవల సూర్యాపేటలో మరణించిన జర్నలిస్టు వసంత్‌ భార్య మంజూలకు ఆర్థిక సాయం చెక్కును శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments