ఫిర్యాదులందితే తప్ప స్పందించని రెవెన్యూ యంత్రాంగం
స్వాధీనం చేసుకున్న భూములకూ రక్షణ లేని దుస్థితి
ప్రజాప్రతినిధులు, నేతల అండతో రెచ్చిపోతున్న రియల్టర్లు
ప్రజాపక్షం / వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఒక వైపు అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతుండగా, మరోవైపు ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో 15 ఎకరాల అసైన్డ్ భూమిని ఓ వ్యక్తి తన పేరున మా ర్చుకున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు ఆసైన్డ్ భూమి అని తేల్చి పదెకరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మిగిలిన ఐదెకరాల విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. వికారాబాద్ కొత్తగడిలో 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అది చాలా వరకు అక్రమణకు గురైందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అనంతగిరిగుట్ట సమీపంలో కేరెళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి అక్రమించుకుని అటవీ భూమిలో నుండి గుడారాలు వేసి రిసార్ట్ నడుపుతూన్నారు. మోమినిపేట్ మండలలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమి కుడా రాజకీయ నాయకుడు ఆక్రమించినట్లు స్థానికంగా అరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల కింద వికారాబాద్ సమిపంలో ని కొత్రెపల్లి పరిధిలోని 100 ఎకరాలో హైదారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తనకున్నభూమిలో కలుపుకుని అందులో ప్రభుత్వ ం నిర్మించిన చెక్ డ్యాంలను సైతం ధ్వంసం చేశాడు. దశాబ్దకాలంగా ప్రభుత్వ భూ ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇటీవల పోలీసుల సహయంతో స్వాధీనం చేసుకున్న ఆ భూమిలో బోర్డు పెట్టి వదిలేశారు. పూడుర్ మండలంలో ఎన్కెపల్లి శివారులో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గోల్ఫ్‌కోర్టు కోసం 16 ఎకరాల ఆసైన్డ్ భూమిని ఆక్రమించగా, గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో బోర్డు పాతి వదిలేశారు.వికారాబాద్ మండలం పరిధిలోని గోధుమగూడ రెవెన్యూ పరిధిలో 18 ఎకరాల ఆసైన్డ్ భుమి ఉండగా, ఇందులో 7 ఎకరాల భూమిలో కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఓ ప్రజాప్రతినిధి అండతో నిర్మాణాలు చేపట్టారు . దీనిపై ఫిర్యాదు అందడంతో ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమ కటడ్టాలను కూల్చివేశారు. కానీ తిరిగి ఇటీవల ఆ భూమిలో పనులు కొనసాగుతున్నాయి. పరిగి మండల పరిధిలోని లక్ష్మిదేవిపల్లి నారాయణ్‌పూర్ రెవెన్యూ పరిధిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని ఏకంగా 14 ఎకరాల భూదాన్ భూమిని తన పరిశ్రమలో కలిపేసుకున్నారు. భూదాన్ భూమిని గుర్తించి ఆ భూమిలు ఫ్యాక్టరీ ప్రహరీ లోపలే ఉండగా అందులో బోర్డు పాతి వదిలేశారు. అటవీ శాఖ భూముల హద్దులు తెలిపే దిమ్మెను కూడా మట్టితో కప్పివేసిన రియల్టర్, అలాగే మున్సిపల్ కార్యాలయం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటవీ భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానిక మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం నుండి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూములను వెంచర్లు చేసి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అండతోనే ఈ పనులు జరుగుతున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి . ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను, అటవీ శాఖ భూములను సర్వే చేసి హద్దులు పెట్టి వాటిని కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పూర్తిగా భూములు కబ్జా చేసి అమ్ముకునే ప్రమాదముంది.
తగిన చర్యలు తీసుకుంటాం: ఆదనపు కలెక్టర్
“ప్రభుత్వ భూములు అక్రమణకు గురిఅయితే ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకుంటాం. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే వాటిపైన కూడా చర్యలు తీసుకుంటాం” అని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ‘ప్రజాపక్షం’ ప్రతినిధికి తెలిపారు.
ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా!
RELATED ARTICLES