అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికార, ప్రతిపక్షాల పరస్పర ఫిర్యాదులు
చోద్యం చూస్తున్న అధికారులు
ప్రజాపక్షం / ముదిగొండ
ఖమ్మ జిల్లా ముదిగొండ మండల పరిధిలోని సువర్ణాపురం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 147 ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సువర్ణాపురం లో సర్వేనెంబర్ 147లో ఉన్న సుమారు 152 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇష్టానుసారంగా ఆక్రమించి అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామంలో సుమారు 20 మంది ఇప్పటికే ఆ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోగా తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నేత అధికార పార్టీకి చెందిన మరొక నాయకుడు ఆ భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఆ గ్రామానికి చెందిన కొందరు అక్రమ నిర్మాణాల విషయంలో ఒకరిపై మరొకరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన నాయకుడు ఆ భూమిని ఇతర వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి నిర్మాణం చేపడుతుండగా స్వపక్షానికే చెందిన ఆ గ్రామ నాయకుడు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్న విషయంపై ఓ వ్యక్తితో ఇటీవల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించడం గమనార్హం. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మిస్తున్నాడని సర్వేనెంబర్ 147 భూమి మొత్తం సర్వే చేయాలని అధికార పార్టీకి చెందిన నేతలు కూడా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయటం విశేషం. ఈ నేపధ్యంలో ఆ గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులకు ఆక్రమణ నోటీసులు ఇవ్వటం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించి అధికారుల తీరుపై టిఆర్‌ఎస్ నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జికి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా సువర్ణాపురంలో అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ప్రభుత్వ భూమి లేదని అధికారులు గ్రామానికి ఆమడ దూరంలో ఉన్న స్థలం చూపించటంతో అక్కడే అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న ప్రధాన సెంటర్‌లోనే ప్రభుత్వ భూమి ఉన్నదని స్వయంగా అధికారులే నోటీసులు ఇవ్వటం గమనార్హం. ఇప్పటికైనా సువర్ణాపురంలో ఉన్న సర్వేనెంబర్ 147లో సమగ్ర సర్వేచేసి ప్రభుత్వ భూమిని వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సువర్ణాపురంలో ఒక వ్యక్తి ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు రావడంతో మదరాస్ యాక్టు ఆరో సెక్షన్ కింద నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఆ భూమిలో మరి కొంత మంది కూడా ఆక్రమణదారులున్నారని, సర్వే చేపట్టాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని, తక్షణమే సర్వేచేస్తామని ఆయన తహసీల్దార్ చెప్పారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణ!
RELATED ARTICLES