HomeNewsBreaking Newsప్రభుత్వ భూమిలో అధికారుల ఇష్టారాజ్యం

ప్రభుత్వ భూమిలో అధికారుల ఇష్టారాజ్యం

స్థానిక నాయకుడితో కలిసి టిఎన్‌జిఓ పేరిట భూ ఆక్రమణ
హాట్‌ కేక్‌గా నస్పూర్‌ సర్వేనెంబర్‌ 42లోని ప్రభుత్వ భూమి
ప్రజాపక్షం/ మంచిర్యాల క్రైమ్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో గల సర్వే నెంబర్‌ 42లోని ప్రభుత్వ భూమిలో అక్రమార్కుల అగడాలకు అడ్డుఅదుపులేకుండా పోతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి లీగల్‌, రియల్టర్‌ల చేతుల్లో హాట్‌కేక్‌గా మారి అమ్మకాలు సాగుతున్నాయి. ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటు తరువాత ప్రభుత్వ పాలన కార్యాలయాలు నస్పూర్‌లోని సర్వే నంబర్‌ 42లో గల ప్రభుత్వ భూమిలో చేపట్టడంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గజానికి సుమారు రూ.50 వేల నుండి రూ. 80 వేల ధర వరకు పలుకుతుండటంతో పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరు ఈ భూమిపై కన్నేసి అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేద బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలను బెదిరించి వారి భూమిని ఆక్రమించుకుని అక్రమంగా అమ్మకాలు చేపడుతున్నారు. 1996లో ఒక ఉద్యోగి తనకు తానే ఎన్‌జిఓ అధ్యక్షుడినని ప్రకటించుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి సర్వే నంబర్‌ 42లో గల భూమిని 33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్‌జిఓ పేరిట రాయించుకున్న విషయం అప్పట్లో బయటికి పోక్కడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఆ వ్యక్తి ఎన్‌జిఓ అధ్యక్షునిగా ఎన్నికైన సరైన ఆధారాన్ని చూపించకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ భూమిని అక్రమ మార్గాన పోందారని మంచిర్యాల సివిల్‌ కోర్టు తప్పుపట్టింది. 2003లో ఎన్‌జిఓ ఆధ్వర్యంలో భూమిని చదును చేస్తుండగా స్థానికంగా నివాసం ఉంటున్న షేక్‌ ఫరీద్‌, మహ్మాద్‌ యాసీన్‌, అబ్దుల్‌ సత్తార్‌ అడ్డుకుని లక్షెట్టిపేట కోర్టు ద్వారా భూమిపై స్టే ఆర్డర్‌ తీసుకువచ్చారు. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో తిరిగి 2010లో ఎన్‌జిఓ ప్రతినిధులు భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న షేక్‌ ఫరీద్‌, మహ్మాద్‌ యాసీన్‌, అబ్దుల్‌ సత్తార్‌లతో పాటు వారి కుటుంబీకులపై ఎన్‌జిఓ నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి అక్రమ కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తంతంగాన్ని బాహ్యా ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియాలో పనిచేస్తున్న అప్పటి పాత్రికేయులకు కొంత మోత్తంలో భూమి అందిస్తామని ఆశ చూపి ప్రభుత్వ భూమి, కోర్టు పరిధిలో ఉన్న భూమిని వారికి బహుమతిగా అందించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భూమిపై స్టేటస్కో ఆర్డర్‌ను తొలగిస్తూ షేక్‌ ఫరీద్‌, నర్సయ్య, పురుషోత్తంతో పాటు మరికొంత మందికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనంతరం 2010లో అప్పటి ఆర్‌డిఓ 42 సర్వే నంబర్‌లో గల భూమిని ఎన్‌జిఓ సభ్యులకు 175 గజాలు చొప్పున అందిస్తూ ప్రొసీడింగ్‌ ఇచ్చారు. రెవెన్యూ అధికారి అందించిన ప్రొసీడింగ్‌ ప్రకారం సంవత్సర కాలంలో కేటాయించిన భూమిలో ఇళ్ళు నిర్మించనిట్లయితే భూమికి అందించిన ప్రొసీడింగ్‌ రద్దు అవుతుందని, వారికి అందించిన ప్రొసీడింగ్‌లో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభన అనంతరం భూమి కేటాయించిన ఎన్‌జిఓ ఉద్యోగులు కొంత మంది రాష్ట్రం విడిచి సొంత రాష్ట్రానికి వెళ్ళడంతో ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు (టి)ఎన్‌జిఓ యూనియన్‌ నాయకులతో చేతులు కలిపి 42 సర్వేనంబర్‌లో ఉన్న ఫ్లాట్లను ఇతర ఉద్యోగులకు రూ.2 లక్షల తీసుకుని అమ్మకం చేశారనే అరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారులు కాంట్రాక్టర్లతో స్థానిక నాయకుడు చేతులు కలిసి ఇష్టారాజ్యాంగా ప్రభుత్వ భూమిని అమ్మకాలు చేపడుతున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన యూనియన్‌ నాయకుడు కూడా ఉద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల చోప్పున వసూలు చేసి స్థానిక నాయకుడితో చేతులు కలిపి ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా 175 గజాలకు మించి నిర్మాణం జరిగిన భూమిపై స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సమాచారం అడగగా ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని, నిర్మాణం జరిగినట్లు సమాచారం లేదని లేఖ అందించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూములను కాపాడాలని స్తానిక ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments