నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే
14న దేశవ్యాప్త నిరసన చేపడతాం
12 నాడు జైపుర్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారుల దిగ్బంధం
రైతుసంఘాలు, కేంద్రం మధ్య రద్దయిన 6వ విడత చర్చలు
సవరణలకు ఓకే… కానీ చట్టాలను రద్దు చేసేది లేదు : కేంద్రం
న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టాల మీద ప్రభుత్వ ప్రతిపాదనలను బుధవారం నాడు రైతు నాయకులు తిరస్కరించారు. తమ ఆందోళన ఉధృతం చేస్తామని, ఈ నెల 14న దేశవ్యాప్త నిరసన చేపడతామని రైతు నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే డిసెంబర్ 12 నాడు జైపుర్ ఢిల్లీ, ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారుల ను, ఒకదాని తర్వాత ఒకటిగా దేశ రాజధానికి దారితీసే అన్ని దారులనూ అడ్డుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు పంపించిన ప్రతిపాదనల్లో కొత్తగా ఏదీ లేదని, వాటిని సంయుక్త కిసాన్ కమిటీ “పూర్తిగా తిరస్కరిస్తోంది” అని రైతు నాయకుడు శివ్ కుమార్ కక్కా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రభు త్వం వేరే ప్రతిపాదనలు పంపిస్తే కూడా పరిశీలిస్తామని మరో నాయకుడు జంగ్వీర్ సింగ్ అన్నారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతంచేసేందుకు, ఢిల్లీకి దారితీసే మార్గాలన్నింటినీ అడ్డుకునేందుకు రైతులు నిర్ణయించారని కక్కా తెలిపారు. ప్రభుత్వంతో కిందటి సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలే తాజా ప్రతిపాదనల్లో ఉన్నాయని రైతు నాయకుడు దర్శన్ పాల్ అన్నారు. పద్నాలుగో రోజు కూడా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగించారు. ఇక ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి.
రాతపూర్వకంగా హామీ ఇస్తాం : కేంద్రం
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది రైతులు నిరసన చేస్తున్న వేళ, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అలానే కొనసాగుతుందని “రాతపూర్వక హామీ” ఇచ్చేందుకు ప్రభుత్వం బుధవారం నాడు ప్రతిపాదించింది. ఇంకా మండీల వ్యవస్థ బలహీనపడుతుందన్న దానితో సహా, కనీసం ఏడు అంశాల విషయంలో అవసరమైన సవరణలు చేసేందుకు కూడా ప్రభుత్వం సరే అంది. నిరసన చేస్తున్న 13 రైతు సంఘాలకు పంపిన ప్రతిపాదన ప్రతిలో రైతుల ఆందోళనలకు అవసరమైన అన్ని అనుమానాలూ తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కానీ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల ప్రధాన డిమాండ్ గురించి అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రభుత్వ ప్రతిపాదనల మీద చర్చిస్తున్నామని, అయితే చట్టాలు వెనక్కి తీసుకోవడమన్న తమ డిమాండ్‌కు కట్టుబడి ఉండటం మినహా తమనుంచి సత్వర స్పందన ఏమీలేదని రైతు సంఘాలు వెల్లడించాయి. నిరసనల సాగదీతకు కారణం ప్రభుత్వమే తప్ప రైతు సంఘాలు కాదని భారతీయ కిసాన్ యూనియన్ (భాను) నాయకుడు రాజీవ్ నాగర్ విమర్శించారు.
రద్దయిన ఆరో విడత చర్చలు
మంగళవారం రాత్రి 13 రైతు సంఘాలతో జరిగిన సమావేశం విఫలమైనప్పటికీ, కొత్త చట్టాల గురించి రైతులు లేవనెత్తిన కీలక అంశాల మీద ప్రభుత్వం తరఫున ఒక ప్రతిపాదన పంపిస్తామని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ పంపించారు. “రైతుల ఆందోళనలను దూరం చేసేందుకు ప్రభుత్వం విశాల హృదయంతో, దేశ రైతాంగం పట్ల గౌరవంతో తనవంతు ప్రయత్నం చేసింది. రైతు సంఘాలు తమ ఆందోళనను విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది” అని ఆ ప్రతిపాదన తెలిపింది. ఇక రైతుల ఆందోళనల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, జరుగుతున్న చర్చల పట్ల తనకు విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. వ్యవసాయ చట్టాల మీద చర్చలకు సంబంధించి త్వరలోనే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల భయాలు ప్రభుత్వ సమాధానాలు
కొత్త చట్టాలు అమలులోకి వస్తే మండీలు బలహీనపడతాయన్న రైతుల భయానికి… మండీలకు బయట ఉన్న వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకునేలా సవరణ చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల (ఎపిఎంసి) మీద విధించినట్లే రాష్ట్రాలు వ్యాపారుల మీద కూడా పన్నులు, సుంకాలు విధించవచ్చని ప్రభుత్వం తెలిపింది. మండీలకు బయట కేవలం పాన్ కార్డు కలిగిన వాళ్లు ఎవ్వరైనా రైతుల్లా నటించవచ్చన్న అంశం గురించి రైతుల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించేలా రాష్ట్రాలకు అధికారం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు సివిల్ కోర్టులకు వెళ్లే హక్కు రైతులకు లేదన్న దాని గురించి కూడా తగిన సవరణ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాద పరిష్కార అధికారాలు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) స్థాయిలోనే ఉన్నాయి. తమ పొలాలు బడా కార్పొరేట్ల ఆక్రమణలోకి వెళ్తాయన్న రైతుల సందేహాల మీద ప్రభుత్వం ఈ విషయం గురించి చట్టంలో ఇప్పటికే స్పష్టంగా వివరించామని వెల్లడించింది. అయినాసరే ఎవ్వరూ కూడా పొలాల మీద అప్పులు తీసుకోకుండా, రైతుల మీద కూడా అలాంటి షరతులు పెట్టకుండా నిబంధన చేరుస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాంట్రాక్టు వ్యవసాయం కింద భూమిని చేర్చడం గురించి కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. అయినా అవసరమైతే మళ్లీ స్పష్టంగా వివరిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. కనీస మద్దతు ధర విషయంలో కూడా రాత పూర్వక హామీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. విద్యుత్ సవరణ చట్టం 2020 రద్దుకు సంబంధించి కూడా రైతులకు ఇప్పుడున్న విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ప్రభుత్వం తెలిపింది. పంటల దహనం విషయంలోనూ తగిన పరిష్కారం కనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రైతుల కష్టం వల్లే ఆహార భద్రత
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం 13 రైతు సంఘాలకు పంపించింది. తమకు ప్రభుత్వ ప్రతిపాదనలు అందాయని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ స్పోక్స్ పర్సన్ రాకేశ్ తికాయత్ పిటిఐతో చెప్పారు. మొత్తంమీద వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, వసతుల కల్పన) చట్టం 2020, రైతులకు (సాధికారత, సంరక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం చట్టం 2020 రెండు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం ఏడు సవరణలు ప్రతిపాదించింది. అయితే అత్యవసర సరకుల (సవరణ) చట్టం 2020ని మాత్రం ప్రభుత్వం ముట్టుకోలేదు. రైతుల కష్టం వల్లే భారత్ ఆహార భద్రత సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. “హరిత విప్లవం సమయంలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు పెద్ద పాత్రనే పోషించారు. ఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు కనీస మద్దతు ధర దగ్గర ధాన్యం కొనడం ప్రభుత్వ మొట్టమొదటి కర్తవ్యంగా ఉంటుంది” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులకు మరిన్ని అవకాశాలు ఇవ్వడమే కొత్త చట్టాల ఉద్దేశం అని, దానివల్ల మంచి ధర లభిస్తుందని, మార్కెట్‌లో ధరలు ఉన్న పంటలు రైతులు పండిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఇతర ఉత్పత్తిదారులకు ఉన్నట్లే తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులకు స్వేచ్ఛ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్టుల నమోదుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తాయని, ఇందుకోసం ఎస్‌డిఎం దగ్గర ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఒప్పందం కుదుర్చుకున్న 30 రోజుల తర్వాత ఎస్‌డిఎం కార్యాలయంలో కాంట్రాక్టు ప్రతిని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయ చట్టాల రాజ్యాంగబద్ధతకు సంబంధించి రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని ఉమ్మడి జాబితా 33వ ఎంట్రీ కింద కాంట్రాక్టు సేద్యం, రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య వ్యాపారం, వ్యవసాయ మార్కెట్లకు బయట రాష్ట్రాలు రుసుములు వసూలు చేయకుండా నిషేధించేందుకు చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాలు అమలు చేసేటప్పుడు, ఆర్డినెన్సులు జారీ చేసేటప్పుడు న్యాయపరమైన అంశాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తామని కేంద్రం తెలిపింది.