చుక్కేసి.. చిందేస్తున్న మందుబాబులు
తాగిన మైకంలో మహిళలతో అసభ్య ప్రవర్తన
కానరాని డ్రోన్ కెమెరాల నిఘా
పత్తా లేని బ్లూకోట్స్ సిబ్బంది
భయాందోళనలో స్థానికులు
ప్రజాపక్షం/కొత్తపల్లి భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాల మందుబాబులకు నిత్యం అడ్డాగా మారుతున్నది. ప్రభుత్వ పాఠశాల అంటే అధికారుల కు, ప్రజాప్రతినిధులకు ఎంత చిన్న చూపు ఉందో కరీంనగర్ రూరల్ మండలం దుర్శెడ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి చూస్తే అవగతమవుతుంది. ఈ పాఠశాల భవనం ఆవరణ బార్‌ను తలపిస్తోంది. తప్పతాగి మందుబాబులు సృష్టిస్తు న్న ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తాగిన సీసాలు పగలగొట్టడం చూస్తే వారి పరిస్థితిని అంచనా వేయొచ్చు. మత్తు మైకంలో రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి వద్దే టీ సాట్ విద్య, టీ సాట్ నిపుణ, దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తోంది. దీంతో నిత్యం వందలాది విద్యార్థుల ఆటపాటలతో కళకళలాడే పాఠశాలలు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు ఉపాధ్యాయులు సైతం ఆన్‌లైన్ బోధన చేస్తుండటం, 50 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం కూడా మందుబాబులకు కలిసొచ్చింది. పాఠశాల విధులు ముగించుకుని ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో పాఠశాల ఆవరణ ఖాళీగా ఉంటోంది. దీన్ని అదునుగా చేసుకున్న మందుబాబులు తమ అడ్డాలను చెట్ల నుండి కాస్త పాఠశాల ఆవరణలోకి మార్చారు. గతంలో కమిషనరేట్ వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలు తిరుగుతూ చెట్లు పుట్టల వెంట మద్యం సేవిస్తున్న మందుబాబుల ఫొటోలను కెమెరాల్లో బంధించి పోలీసులు కేసులు నమోదు చేసేవారు. బడి పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు తిరుగకపోవడం మందుబాబులకు కలిసొచ్చే అంశంగా మారింది. పాఠశాల తమకు అనువైన ప్రదేశమని గుర్తించిన మందుబాబులు అడ్డా మార్చినట్లున్నారని స్థానికులు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఇటువైపు రావడంలేదని, బ్లూకోట్స్ సిబ్బంది సైతం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మందుబాబులకు అడ్డాగా మారిన పాఠశాలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాల ఓపెన్ బార్
RELATED ARTICLES