HomeNewsTelanganaప్రభుత్వ పాఠశాలల్లో అటకెక్కిన అల్పాహారం

ప్రభుత్వ పాఠశాలల్లో అటకెక్కిన అల్పాహారం

అంతంత మాత్రంగా మధ్యాహ్న భోజనం
సకాలంలో వంటల నిర్వాహకులకు బిల్లులను చెల్లించక పోవటమే కారణం
భోజనంలో మాయమవుతున్న మెనూ పదార్థాలు
ప్రజాపక్షం/మేడ్చల్‌ ప్రతినిధి
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమలు పరుస్తున్న మధ్యాహ్న భోజన పథకం అంతంత మాత్రంగానే కొనసాగుతుండడంతో కేంద్రం నిర్దేశించిన పౌష్టికాహారం లభించకుండా పోతోంది. విద్యార్థులకు అల్పాహారాన్ని సైతం అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రారంభించిన గత ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగా మారి ఎక్కడా కనపడకుండా పోయింది. విద్యార్థులకు అందించే ఈ పథకానికి అవసరమయ్యే వంటకాలను తయారుచేసే నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులను చెల్లించక పోవటమే కాకుండా నెలల కొద్దీ తాత్పారం చేస్తున్న కారణంగా మెనూలోని పదార్థాలు తగ్గిపోయినా అడగలేకపోతున్నారు. తమ బిల్లులను చెల్లించాలని వంట నిర్వాహకులు గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రాజధానికి చేరి సమ్మె సైతం చేసారు. కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతంగా రాష్ట్రంలో ఒకటి నుండి పదో తరగతి వరకు చదివే 28,606 పాఠశాలల్లోని 25,26,907 విద్యార్థులకు 1995లో ప్రారంభమైంది. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లడం మానివేయకూడదని, హాజరు శాతాన్ని పెంచడం, పిల్లల్లో సామాజిక సమభావన పెంపొందించటం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించటం ప్రధాన లక్ష్యంగా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. జాతీయ పౌష్టికాహార సంస్థ మధ్యాహ్న భోజనంలో ఏమేమి వంటకాలను ఉండాలో నిర్దేశిస్తుంది. ఈ మెనూ ప్రకారం వంటకాలను తయారు చేసేందుకుగాను స్థానికంగా ముందుకు వచ్చే వారిని ఎంపిక చేసుకుని వారికి పాఠశాల ప్రాంగణంలోనే ఓ గదిని కేటాయించాల్సి ఉంటుంది. వంట పదార్థాలను తయారు చేసేందుకు స్థానికులను ఎంపిక చేయటం వల్ల వారికి ఉపాధి ఏర్పడుతుందని ప్రభుత్వ ఉద్దేశం. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం, అల్పాహారం తయారీ నాణ్యత పరిశీలన, విద్యార్థులకు వడ్డన కార్యక్రమం అంతా పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. వంట చేసేందుకుగాను అవసరమయ్యే బియ్యం ముందుగా ప్రభుత్వం నేరుగా వివిధ పాఠశాలలకు సరఫరా చేస్తుండగా దానిలో నుండి వంట చేసే వారికి ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్దేశించిన పరిణామంలో ప్రధానోపాధ్యాయుడు ఇవ్వాల్సి ఉంటుంది. వంటలకు అవసరమయ్యే ఇతర కిరాణా పదార్థాలన్నిటిని వంటల నిర్వాహకులు స్వయంగా ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా ఐదవ తేదీలోగా నెల వారీ బిల్లులను సమర్పించిన అనంతరం ప్రభుత్వం చెల్లిస్తుంది.
బిల్లులు సమయానికి చెల్లించక ఆందోళన బాట పట్టిన వంట నిర్వాహకులు
రాష్ట్రంలో చాలా కాలం నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సజావుగానే కొనసాగుతున్నప్పటికీ గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం వంటల నిర్వాహకులకు ప్రతి నెలా బిల్లులను సకాలంలో చెల్లించటంలో నిర్లక్ష్యం చేసింది. చివరికి వారికి రావల్సిన ఈ బిల్లులు 10 నుండి 12 నెలల వరకు పెండింగ్‌లో ఉండడంతో వంటల నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులకు గురవ్వాల్సి వచ్చింది. ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేక చివరికి మధ్యాహ్న భోజన వంటల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని నగరానికి తరలివచ్చి ఆందోళన చేశారు. ఇప్పటికీ తమకు ఆరు నెలలకు పైగా బిల్లులు ప్రభుత్వం నుండి రావల్సి ఉందని, కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వమైనా వెంటనే బిల్లులు చెల్లించే ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. అల్పాహారాన్ని ప్రారంభించిన కొన్నాళ్లకే ఆగిపోవటానికి సకాలంలో గత ప్రభుత్వం బిల్లులను చెల్లించక పోవటమే కారణమని చెప్పొచ్చు. ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారం చేపట్టిన నూతన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథక వంటల నిర్వాహకులకు పెండింగ్‌ బిల్లులను చెల్లించటంతో పాటు ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తూ విద్యార్థులకు జాతీయ పౌష్టికాహార సంస్థ నిర్దేశించిన విధంగా పౌష్టికాహారం అందే ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments