HomeNewsBreaking Newsప్రభుత్వ నిరంకుశత్వం, మతవాదం, నకిలీ జాతీయవాదంరాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయ్‌

ప్రభుత్వ నిరంకుశత్వం, మతవాదం, నకిలీ జాతీయవాదంరాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయ్‌

మోడీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హక్కు, జీవనోపాధి సమస్యలపై యువత పోరాడుతున్న దుస్థితి
ప్రజాస్వామిక గొంతుకలను అణిచివేస్తూ, దేశ వ్యతిరేక ముద్ర వేస్తున్నార
సిపిఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ త్వం, మతవాదం, నకిలీ జాతీయవాదం మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని, అది మన శాస్త్రీయ స్వభావం, హేతుబద్ధమైన ఆలోచన, భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఎఐవైఎస్‌ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో భాగంగా ప్రతినిధుల సభ తేరాపంత్‌ భవన్‌ లో కామ్రేడ్‌ సిద్ది వెంకటేశ్వర్లు హాల్‌లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత ఎఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌. తిరుమలై ఎఐవైఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రారంభమైన ప్రతినిధుల సభకు ఎఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర స్వాగతం పలుకగా, ఎఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు డాక్టర్‌ వలీ ఉల్లహ్‌ ఖాద్రి అధ్యక్షత వహించారు. ఆర్‌. తిరుమలై ప్రతినిధుల సభను ప్రారంభించగా, కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హక్కు, జీవనోపాధి సమస్యల కోసం యువత పోరాడవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను దూకుడుగా అనుసరించడం వల్ల నిరుద్యోగం, అసమానతలలో తీవ్ర పెరుగుదల జరిగిందని అయన తెలిపారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు కల్పించే బదులు, దేశంలో యువత ఉద్యోగాలపై ఆశలు కోల్పోయే దశ కల్పించేలా చేశారని అయన దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతూ మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తూ, వివక్షాపూరిత చట్టాలు తెచ్చి మన దేశ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అయన మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి ప్రజాస్వామిక గొంతుకలను అణిచివేస్తూ, దేశ వ్యతిరేక ముద్ర వేస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ మోడీ ప్రభుత్వం ఎంత అణిచివేసే ప్రయత్నాలు చేసిన యువత ప్రశ్నిస్తూ, సమస్యలపై నిలదీస్తూ స్థిరమైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉండాలని కోరారు. సర్దార్‌ భగత్‌సింగ్‌ వంటి అమరవీరులే మన పోరాటాలకు మూలం అని, భగత్‌సింగ్‌ పోరాట స్పూర్తితో భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య, బహుళ సాంస్కృతిక, బహుళ వ్యవస్థలను కాపాడుకోవడానికి ఎఐవైఎఫ్‌ ఒక శక్తివంతమైన యువజన ఉద్యమాన్ని నిర్మించాలని కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. ఆర్‌. తిరుమలై మాట్లాడుతూ భారతదేశం అంతటా ఉపాధి, విద్యలో యువత హక్కులను పొందే పోరాటాలలో ఎఐవైఎఫ్‌ ముందంజలో ఉందని గుర్తు చేశారు. సామూహిక పోరాటాల ద్వారా భారతీయ యువతలో విశ్వాసాన్ని పొంది, ఎఐవైఎఫ్‌ మన దేశంలో అతిపెద్ద యువజన సంస్థగా కొనసాగుతుందని తెలిపారు. పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల నేటి యువతలో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో భారతదేశంలో ఉద్యోగాల పరిస్థితి ఫుర్తిగా దిగజారిందని, ఇటీవలి సంవత్సరాలలో సంపూర్ణ ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య కూడా పడిపోయిందని, ఈ పరిస్థితిని “ఉద్యోగ-నష్ట వృద్ధి”గా అయన పేర్కొన్నారు. మన దేశ రాజ్యాంగంలోని సారాంశాన్ని, ఉనికినే సవాలు చేసే ఫాసిస్ట్‌ వాతావరణంలో ఉన్నామని, యువత దీనిని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరముందని అన్నారు. యువత హక్కులు, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య, లౌకిక స్వభావం, జాతీయ ఐక్యతను కాపాడటానికి ఎఐవైఎఫ్‌ అవిశ్రాంత పోరాటాల తరంగాన్ని ఆవిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వామపక్ష ప్రగతిశీల సంస్థలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ‘సోషలిజమే భవిష్యత్తు భవిష్యత్తు మనది’ అనే నినాదాన్ని కొనసాగించలని ఆర్‌. తిరుమలై కోరారు. ఈ మహాసభలో వేదికపై సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయాదేవి, ఎఐవైఎఫ్‌ రాష్ర్ట నేతలు నిర్లేకంటి శ్రీకాంత్‌, లింగం రవి, వెంకటేశ్వర్లు, శంకర్‌, యుగంధర్‌, సురేష్‌, రామకష్ణ, సత్యప్రసాద్‌ తదితరులు ఆసీనులయ్యారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments