రోగుల పాలిట శాపం
షుగర్, బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న యువతికి చికిత్స చేయని ఇఎన్‌టి, ఉస్మానియా వైద్యులు
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్
ఆసుపత్రులు చికిత్సను అందించే విషయం లో సమన్వయ లోపంతో రోగులు బలవుతున్నారు. నిన్న గాక మొన్న చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణం గా నిండు గర్భిణి మృత్యువాత పడిన విష యం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులు ఆపదలో ఉన్న రోగులను చేర్చుకునే విషయంలో పరిధిలు, సదుపాయాలు అంటూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన 30 ఏళ్ళ గిరిజన యువతిని అధిక షుగర్, బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇక అక్కడి నుంచి వారి బాధలు మొదలయ్యాయి. రోగిని బ్లాక్ ఫంగస్ నోడల్ ఆసుపత్రి కోఠిలోని ఇఎన్‌టి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి అత్యవసర విభాగం వైద్యులు పరిక్షించి “రోగికి షుగర్ స్థాయి ఎక్కువగా ఉంది..ఉస్మానియా వెళ్ళండి” అని సలహా ఇచ్చారు. వెంటనే రోగిని అక్కడికి తీసుకువెళ్ళగా “రోగికి బ్లాక్ ఫంగస్ ఉంది….ఇఎన్‌టికే తీసుకువెళ్ళండి” అని ఉస్మానియా వైద్యులు సూచించారు. దీంతో అటూ ఇటూ తిరిగి తిరిగి రోగితో పాటు ఆమె బంధువులు కూడా అచేతన స్థితిలో పడ్డారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్న రోగి బంధువులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన 30 ఏళ్ళ గిరిజన యువతికి షుగర్ శాతం అతిగా పెరిగి, బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై ఆరోగ్యం విషమించడంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ ఇఎన్‌టి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి 11 గంటలకు ఖమ్మం నుండి హైదరాబాద్ ఇఎన్‌టి ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకువచ్చారు. ఈఎన్‌టి వైద్యులు పరిక్షించి ఆమెకు షుగర్ 500 ఉంది, ముందు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించండి, చక్కర శాతం తగ్గిన తరువాత బ్లాక్ ఫంగస్ చికిత్స చేస్తామని చెప్పి పంపించారు. అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి వైద్యులు పరిక్షించి ఇది బ్లాక్ ఫంగస్ కేసు తాము చికిత్స చేయం, ఇఎన్‌టికే తీసుకెళ్లండి అని పంపించివేశారు. కుటుంబసభ్యులు రోగిని మళ్ళీ ఇఎన్‌టి ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం డాక్టర్లు ఇది చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇక్కడ చికిత్స సదుపాయాలు ఏమి లేవని, షుగర్ లెవల్స్ తగ్గి వస్తేనే గానీ బ్లాక్ ఫంగస్ చికిత్స చేయబోమని తేల్చి చెప్పేసారు. చికిత్స అందక ఈఎన్‌టి ఆసుపత్రి వద్ద యువతి స్ట్రెచర్‌పైనే అచేతన స్థితిలో ఉండగా, చేసేదేమీలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడ ఉన్న వారి హృదయాలను ద్రవింపజేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ లోపం
RELATED ARTICLES