ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
బావులను తలపిస్తున్న ఇసుక రేవులు
ప్రజాపక్షం/ఖమ్మం బ్యూరో: ప్రభుత్వం ఇసుకకు సంబంధించి విధించిన నిబంధనలు కొం దరికి వరంగా మారాయి. ఇప్పుడు ఇసుక ప్రియమైపోయింది. బస్తాల్లో కేజీల లెక్కన కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు డబ్బులు లేక నిలిచిపోయిన నిర్మాణాలు ఆగిపోతే.. ఇప్పుడు డబ్బులుండి ఇసుక లేక నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్లు, లారీల కోసం ఖమ్మం నగర శివార్లలో వందల మంది వేచి చూస్తున్నారు. ఒక ట్రక్కు వచ్చిందంటే పదుల సంఖ్యలో జనం గుమిగూడిపోతున్నారు. అవసరమైతే వేలంపాట ద్వారా ఇసుకను పొందేందుకు సైతం వెనుకాడడం లేదు. ఇంత డిమాండ్ ఉన్న ఇసుక అక్రమ తరలింపు స్థాయిని బట్టి డబ్బు ను పోగేసి పెడుతుంది. ఏడాది క్రితం ట్రాక్టర్‌తో ఇసుక అక్రమ రవాణా చేయడం ప్రారంభించిన వ్యక్తి ఏడాది తిరక్కముందే సంపన్నుడైపోతున్నాడు. పోలీస్ అధికారుల సహకారం ఉంటే ఆర్థికంగా ఎదిగేందుకు అవధులు ఉండడం లేదు. ఇసుక వనరులు ఉన్నా నదులు, ఏర్లు, వాగుల సమీప గ్రామాల్లో ఇప్పుడు ఇసుక అతిపెద్ద వ్యాపారంగా మారింది. వందల కిలో మీటర్ల దూరానికి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దారి పొడవునా తమ అనుయాయిలను నిలిపి అధికారులను ప్రసన్నం చేసుకుంటూ అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒకప్పుడు ఇసుకను ట్రక్కుల లెక్కన కొనుగోలు చేసేవారు. ఇప్పుడు టన్నుల్లోకి మారింది. టన్ను రూ.1,500ల నుంచి రూ.2వేల వరకు ప్రాంతాలను బట్టి ధర పలుకుతుంది. చిన్న చిన్న నిర్మాణాలు చేసేవారు. రసాయనిక ఎరువుల మాదిరి కేజీల లెక్కన ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఓ జిల్లాకో, ఓ ప్రాంతానికో పరిమితం కాలేదు. రాష్ట్రం మొత్తం ఇదే తంతు సాగుతుంది. కొందరు ప్రజాప్రతినిధులకు కూడా ఇసుక అక్రమ రవాణా కాసులు కురిపిస్తుంది. గ్రామస్తులు కానీ, పర్యావరణ ప్రియులు కానీ అడ్డు చెబితే భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తరలింపులో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు యాజమానిపైన, డ్రైవర్ పైన కేసులు నమోదు చేయాలి. కానీ ఇవి మచ్చుకు కూడా కానరావడం లేదు. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులను బెదిరిస్తున్నారు. మావాడే వదిలేయమంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.