HomeNewsBreaking Newsప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వీర్యానికి కుట్ర

ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వీర్యానికి కుట్ర

మోడీ సర్కార్‌పై ఎఐటియుసి ఆగ్రహం
16,17తేదీల్లో బ్యాంక్‌ ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు
ప్రజాపక్షం/ హైదరాబాద్‌ ప్రభుత్వరంగంలోని బ్యాంకులను కొనసాగించాలని ఎఐటియుసి రాష్ట్ర కౌన్సిల్‌ డిమాండ్‌ చేసిం ది. ప్రభుత్వ బ్యాంకులను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు శక్తులకు, కార్పొరేట్‌ వ్యక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టే చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో బ్యాంకులు కొనసాగించాలని, ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని, బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 16,17 తేదీల్లో బ్యాంక్‌ ఉద్యోగులు దేశవ్యాపితంగా నిర్వహిస్తున్న సమ్మెకు ఎఐటియుసి రాష్ట్ర కౌన్సిల్‌ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దేశవ్యాపితంగా రెండు రోజుల పాటు జరిగే సమ్మె లో 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొ ని మోడీ చర్యను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ఆల్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌.ఎన్‌.రెడ్డి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తొలిసారిగా అధికారం చేపట్టిన తర్వాత ప్రైవేటీకరణకు ఊతమిచ్చారని, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగవంతం చేశారని విమర్శించారు. జాతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా దోహదపడే బ్యాంకింగ్‌ రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్‌ శక్తులకు ఎవరి ప్రయోజనాల కోసం ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని నిలదీశారు. బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశంలో బిల్లులు తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడుకుని తీరుతామని స్పష్టం చేశారు. 28 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం పేరుతో 12కు కుదించారని ఆరోపించారు. 1969లో 14 బ్యాంకులను, 80 దశకంలో 6 బ్యాంకులను జాతీయం చేసి దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను వృద్ధిపథంలో సాగించటంలో కీలక భూమిక పోషించాయని వి.యస్‌.బోస్‌ గుర్తుచేశారు. పారిశ్రామిక హరిత విప్లవానికి దోహదపడటంతో పాటు అభివృద్ధికి నోచుకోని కింది వర్గాలకు సబ్సిడీతో రుణాలు కూడా అందజేసి ఆ వర్గాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయటంలో ప్రభుత్వ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటురంగానికి వెళితే రిజర్వేషన్‌ విధానం అములో ఉండదని, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మాజీ సైనిక ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీవ్రాతితీవ్రమైన నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో అనేక ప్రైవేటు బ్యాంకులు మూతపడి ఖాతాదారుల ధనాన్ని కొల్లగొట్టుకుపోయాయని, అయితే ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాదారుల సొమ్ముకు భద్రత, భరోసా ఉంటుందని అన్నారు. అత్యంత కీలకమైన పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న 22,219 బ్రాంచీలు కలిగి 51 బిలియన్‌ డాలర్లతో ప్రగతి పథంలో సాగుతున్న ఎస్‌బిఐ నుంచి ఆదానీ కంపెనీకి మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు రుణాల రూపేణా ఇచ్చిందని, ఇది శ్రేయస్కరం కాదని అన్నారు. రెండు రోజులపాటు జరిగే సమ్మెకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు, సమాజంలో ఉన్న సకల వర్గాలు సంఘీభావంగా నిలవాలని వి.ఎస్‌.బోస్‌ పిలుపునిచ్చారు. సమావేశానికి ఎఐటియసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాల్‌రాజ్‌ అధ్యక్షత వహించగా, వేదికపై ఎఐటియుసి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.డి.యూసుఫ్‌, కోశాధికారి పి.ప్రేంపావని ఆశీనులయ్యారు. సంతాప తీర్మానాన్ని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.చంద్రయ్య ప్రవేశపెట్టగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, మాజీ గవర్నర్‌ రోశయ్య, స్వాతంత్య్ర సమరయోధులు బూర్గుల నర్సింగ్‌ రావు, టి.నరసింహన్‌, బాలసుబ్రమణ్యం, తుర్లపాటి కుటుంబరావు, జాకబ్‌, స్వామి అగ్నవేష్‌, పి.సి.నర్సింహ్మ, సత్యనారాయణ, జయదాస్‌, ప్రభాకర్‌ చౌదరి, సాంబశివరావు, గంగాధర్‌ రావు, రాజేశ్వరరావు, వి.వి.రామారావు, ప్రద్యుమ్నరెడ్డి, కైలాసపతి, బాలసాహేబ్‌ తదితరులకు సమావేశం శ్రద్ధాంజలి ఘటించింది.

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ప్రభుత్వం రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వారి సమస్య మాత్రమే కాదని, దేశ సంపద ప్రైవేటీకరణ కాకుండా పోరాడే సమస్య అని, సమ్మెను అన్ని వర్గాల ప్రజలు బలపర్చాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు సురవరం సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనున్న అన్ని బ్యాంకుల సంఘాలు డిసెంబర్‌ 15, 16 తేదీలలో రెండు రోజులపాటు దేశ వ్యాపిత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నదన్నారు. 1969లో వామపక్షపార్టీల ఒత్తిడి మేరకు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బ్యాంక్‌లను జాతీయం చేశారని గుర్తు చేశారు. అంతకు ముందు కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల యాజమాన్యాలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాయని, ముంద్ర కుంభకోణం బయటపడిందన్నారు. జాతీయం చేసిన తరువాత డిపాజిట్లు పెరిగాయని, వేలాది నూతన బ్రాంచీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలకొల్పబడ్డాయని,పేదలకు, చిన్న, మధ్య తరగతి వ్యాపారస్థులకు, రైతులకు , స్వయం ఉపాధి చేసుకునేవారికి బ్యాంక్‌ రుణాలు ఇవ్వబడ్డాయని వివరించారు. రిజర్వేషనల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. బ్యాంకులు లాభాలు గడించాయని సురవరం పేర్కొన్నారు.నరేంద్రమోడి నాయకత్వం క్రింద బిజెపి ప్రభుత్వం బ్యాంకులు ఇతర ప్రభుత్వరంగాల ప్రైవేటీకరణకు పాల్పడుతున్నదన్నారు. తెలుగు ప్రజల బ్యాంకులు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, ఆంధ్రాబ్యాంక్‌ లాభాలు సంపాదిస్తున్నప్పటికీ ఇతర బ్యాంకులలో విలీనం చేయబడ్డాయని తెలిపారు. ప్రైవేటీకరణ తరువాత రిజర్వేషన్లు వుండవు. బ్యాంకుల లాభాలు ప్రభుత్వం మొదలు, కార్పోరేట్‌ కంపెనీలకు పోతాయని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బ్యాంక్‌ సమ్మెకు సిపిఐ మద్దతు
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఈ నెల 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్వహించతలపెట్టిన ‘బ్యాంకు సమ్మె’కు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే చర్యలను చర్యలను విరమించుకోవాలని గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకుల జాతీయీకరణ కోసం జరిగిన విజయవంతమైన పోరాటంలో సిపిఐ అగ్రభాగంలో నిలిచిందని, ఇది గ్రామీణ ప్రాంతాలకు, ఇతర బ్యాంకులు లేని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్‌ రంగాన్ని తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేసిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని, ప్రజల సొమ్మును రక్షించాలని, దానిని కార్పొరేట్‌ దోపిడీకి కాకుండా ప్రజల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని సిపిఐ తన వైఖరిని పునరుద్ఘాటిస్తుందని రాజా తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments