శ్రీనగర్: ‘ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందా?.. నేను ముఫ్తీ ట్వీట్ చూసినా చూడకపోయినా నిన్న అసెంబ్లీ రద్దు చేయాలని ముందే నిర్ణయించాను. నిన్న పండగ రోజు అయినందున నా నిర్ణయం నిన్న చెప్పాలనుకున్నా. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది’ అని గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. తాను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత 15రోజులుగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని.. ఇలా ఫిరాయింపుల ప్రభుత్వాన్ని తాను అంగీకరించబోనని అన్నారు. ‘సాధ్యంకాని పొత్తు’తో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడదని తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సెలవు అని, రాజ్‌భవన్‌లో ఉద్యోగులు ఎవ్వరూ రాలేదన్నారు. కనీసం వంట మనిషి కూడా రాలేదని, తనకు ఆహారం అందించే వాళ్లు కూడా లేరని పేర్కొన్నారు. తాను ఒక్కడినే ఫ్యాక్స్ మెషిన్‌కు సంబంధించిన పనులు కూడా ఎలా చూసుకోగలనని ఆయన ప్రశ్నించారు. పిడిపి, ఎన్‌సి పార్టీ నేతలిద్దరూ ముస్లింలే కదా.. వారికి నిన్న సెలవనే విషయం తెలిసి ఉండాల్సింది అని అన్నారు. అయితే ఫ్యాక్స్‌కు సంబంధించినది సమస్యే కాదని, ఒకవేళ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఫ్యాక్స్ చేసినా కూడా తాను అసెంబ్లీని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకునే వాడినని మాలిక్ వెల్లడించారు.
కాగా, ఎన్‌సి, కాంగ్రెస్‌ల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను కోరుతూ లేఖ పంపించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని, రాజ్‌భవన్‌లో ఫ్యాక్స్ పనిచేయలేదని ముఫ్తీ తెలిపారు. దీంతో ఆమె లేఖను ట్విటర్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత కూడా బిజెపి, ఇతరుల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరుతూ లేఖను వాట్సాప్ ద్వారా గవర్నర్‌కు పంపించారు. కాగా నిన్న ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫ్యాక్స్ పనిచేయకపోవడం వల్ల ముఫ్తీ తనకు మెజార్టీ ఉందని పంపిన లేఖ గానీ, ఎన్‌సి మద్దతిస్తుందని పంపిన లేఖ గానీ తనకు చేరలేదని గవర్నర్ గురువారం వెల్లడించారు. అసెంబ్లీ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తామని పిడిపి, ఎన్‌సి పార్టీ నేతలు తెలిపారు. అయితే అయిదు నెలలుగా వాళ్లే అసెంబ్లీని రద్దు చేయాలని అడిగారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తాం అంటున్నారు.. అది వాళ్ల హక్కు, వెళ్లాంటే వెళ్లొచ్చు అని మాలిక్ తెలిపారు.
ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందా..
RELATED ARTICLES