రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్‌పై ప్రతిష్టంభన
బుధవారానికి వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ విఫలమైంది. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఆ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపాలని పంతపట్టాయి. ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2018 పై చర్చ జరపాలని ప్రభుత్వం పట్టుబట్టింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టగానే దానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేసిం ది. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా రాజ్యసభ ఎలాంటి చర్చ జరపలేదు. గందరగోళం మధ్య సభ వాయిదాపడింది. దీనికి ముందు రాజ్యసభ రెండుసార్లు వాయిదాపడింది. మొదట కావేరి సమస్యపై ఎఐఎడిఎంకె సభ్యులు నిరసనలు కొనసాగించడంతో ఉదయం సభ వాయిదాపడింది. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు తలాఖ్ బిల్లు ప్రవేశపెట్టగానే 15 నిమిషాలపాటు వాయిదాపడింది. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ అజాద్ ఈ బిల్లు చాలా కీలకమని, దీని పరిశీలన అవసరమని అన్నారు. అనేక పార్టీలకు చెందిన సభ్యులు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరుతున్నారని పేర్కొన్నారు. చట్టం చేసే ముందు బిల్లులను పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీలకు పంపే సాంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అజాద్ ఆరోపించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయెల్ ఆరోపించారు. ఇదివరలో ఈ బిల్లుకు లోక్‌సభలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని కూడా గుర్తుచేశారు.‘కాంగ్రెస్, ఇతర పార్టీలు ముస్లిం వివాహిత మహిళల హక్కుల విషయంలో రాజకీయం చేస్తున్నాయి’ అని ఆక్రోశాన్ని వెల్లగక్కారు. దీనిపై కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ ఘాటుగా ప్రతిస్పందించారు. ‘ప్రభుత్వమే రాజకీయాలు చేస్తోంది.