జిల్లా కేంద్రంలో వెలుస్తున్న శిక్షణా కేంద్రాలు
మెటీరియల్ సేకరణలో అభ్యర్థులు నిమగ్నం
శిక్షణకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు
ప్రజాపక్షం / కరీంనగర్ బ్యూరో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించి నూతనోత్సాహం మొదలైంది. ఉద్యోగాన్ని సాధించేందుకు సిద్ధమవుతూ కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. కోచింగ్ సెంటర్లకు వెలుతుండటంతో పాటు సీనియర్ల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారు. కొలువు సాధించాలన్న కొండంత ఆశతో గ్రంథాలయాల్లోనూ పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. మెటీరియల్ సేకరణలో భాగంగా బుక్‌స్టాల్స్, గ్రంథాలయాల్లో విద్యార్థుల సందడి
నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సెంటర్లలో చేరేందుకు ఉద్యోగార్థులు ఆసక్తి చూపుతున్నారు. అత్యధిక మంది నిరుద్యోగులు నగర శివారులో వెలిసిన పలు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. కాగా వివిధ నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నగరంలో వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన కోచింగ్ సెంటర్లు కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోట, ముఖరంపుర, గీతాభవన్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాలో అన్ని విభాగాల్లో కలిసి 14 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కానుండడంతో నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించేందుకు అందులో చేరుతున్నారు. ఇప్పటికే బిసి, ఎస్‌సి స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లలో ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతంలో ఈ కోచింగ్ సెంటర్లలో చేరి అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన దాఖలాలు ఉండడంతో నిరుద్యోగులు వాటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీయువకుల కోసం తమ నియోజకవర్గాల్లో కూడా ఎంఎల్‌ఎలు స్వంత డబ్బుతో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.
టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తా
రాంకుమార్, ముకరంపుర, కరీంనగర్.
“బిఈడి పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సిఎం కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తా” అని కరీంనగర్ పట్టణంలోని ముకరంపురకు చెందిన రాంకుమార్ తెలిపారు.