1.75 లక్షల కోట్ల రక్షణ సామగ్రి ఎగుమతి లక్ష్యం
న్యూఢిల్లీ : దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి ప్రోత్సాహం కలిగించే చర్యల్లో భాగంగా ఆకాశ్ క్షిపణి ఎగుమతులకు కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని 96 శాతం మేరకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలోనే తయారు చేశారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఈ క్షిపణి అవలీలగా ధ్వంసం చేస్తుంది. వివిధ దేశాలు ఆకాశ్ క్షిపణి కోసం చేసే ఆర్డర్లను ఆలస్యం లేకుండా సత్వర ఆమోదాలకు వీలుగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. భారత సైనిక దళాలకోసం తయారు చేసిన ఆకాశ్ క్షిపణి కంటే ఎగుమతులకోసం ఉద్దేశించిన ఈ ఆకాశ్ క్షిపణి చాలా భిన్నమైనదిగా ఉంటుందని రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రక్షణ రంగానికి సంబంధించిన సామగ్రి, క్షిపణులను విస్తారమైన స్థాయిలో ఉత్పత్తి చేయడంలో మనదేశం తన శక్తిసామర్థ్యాలను బాగా పెంపొందించుకుంటోందన్నారు. ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయుధ ఉత్పత్తులు చేసేవారు తక్కువగా ఉన్నారన్నారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో భారత్ కూడా పోటీ పడేందుకు మంత్రివర్గ నిర్ణయం దోహదపడుతుందని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఐదు బిలియన్ డాలర్ల విలువైన అత్యంత శక్తిసామర్థ్యాలుగల ఉన్నత శ్రేణి రక్షణ సామాగ్రి ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మిత్ర దేశాలతో వ్యూహాత్మకమైన సంబంధాలను మెరుగుపరుచుకోగలమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దేశీయంగా రక్షణ ఉత్పత్తులను గణనీయంగా పెంచి, 2025 నాటికి 1.75 లక్షల కోట్ల టర్నోవరుగల రక్షణ సామాగ్రి ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రాబోయే ఐదేళ్ళలో భారత సాయుధ బలగాలు పెట్టుబడుల సేకరణలో సుమారు 130 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2024 నాటికి రవాణా ఎయిర్‌క్ట్రాఫ్ట్‌లు, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, సంప్రదాయ జలంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు సహా 101 రకాల ఆయుధాల దిగుమతులు నిలిపివేస్తామని ఆగస్టులోనే రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు.
కొత్తగా మూడు దేశాల్లో రాయబార కార్యాలయాలు
మూడు దేశాల్లో రాయబార కార్యాలయాలు ప్రారంభించేందుకు బుధవారంనాటి కేంద్రమంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఉత్తర యూరప్ బాల్టిక్ సముద్రతీరంలో ఉన్న ఎస్తోనియా, దక్షిణ అమెరికాలో ఉన్న పరాగ్వే, కరీబియన్ ప్రాంతంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశాల్లో వాణిజ్యాభివృద్ధికి, సాంస్కృతిక సంబంధాల అభివృద్ధికి, భారత్ తనదైన దౌత్య మార్గాన్ని, రాజకీయ సంబంధాలను విస్తరించేందుకూ ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు చెప్పారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్దేశమని, అందులో భాగంగానే కొత్త రాయబార కార్యాలయాలు ప్రారంభిస్తున్నామనీ అన్నారు. భారత్ అనుసరించే విదేశాంగ విధాన లక్ష్యాలకు ప్రపంచవ్యాప్తంగా బహుళ వేదికలపై మద్దతు కూడగట్టేందుకు, రాజకీయంగా చేరువయ్యేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయన్నారు. భారత్ ఆర్థికవృద్ధికి, అవృద్ధికి, మిత్రదేశాలతో భాగస్వామ్యం నెరపడానికి సానుకూల వాతావరణం నిర్మించడమే మన విదేశాంగ విధాన లక్ష్యమని జవదేకర్ చెప్పారు.
ప్రపంచ విపణిలోకి ఆకాశ్ క్షిపణి
RELATED ARTICLES