HomeNewsBreaking Newsప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటం

భారత్‌లో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి
సిపిఐ డిమాండ్‌
సిఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి
‘తెలంగాణ సాయుధ పోరాట 73వ వార్షికోత్సవాలు’ ప్రారంభం
ప్రజాపక్షం / హైదరాబాద్‌
భారతదేశంలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్‌ 17వ తేదీన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గతంలోనే సిఎం కెసిఆర్‌ ‘సెప్టెంబర్‌ 17’ను అధికారికంగా నిర్వహిస్తామని మాట ఇచ్చారని, దానిని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా ‘తెలంగాణ సాయుధ పోరాట 73వ వార్షికోత్సవాలు’ శనివారం ఘనంగా ప్రారంభమయ్యా యి. సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యం లో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సాయుధ పోరాట సేనాని మఖ్దూం మొహియెద్దీన్‌ విగ్రహం వద్ద ఉత్సవాలను నిర్వహించింది. దీనికి నారాయ ణ, చాడ వెంకట్‌రెడ్డిలతో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర సహా య కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌, వి.ఎస్‌.బోస్‌, ఎన్‌.బాలమల్లేశ్‌లు హాజరయ్యారు. తొలుత మొహియొద్దీన్‌ విగ్రహానికి నారాయణ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మహత్తర తెలంగాణ సాయుధపోరాటం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిందన్నారు. ఆ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాడు 550 సంస్థానాలలో హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ మిన హా అన్ని సంస్థానాలు 1947 ఆగస్టు 15న భారత యూనియన్‌లో విలీనమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ను నిజాం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారని, దీంతో కమ్యూనిస్టు పార్టీ 1947 సెప్టెంబర్‌ 11నసాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందన్నారు. అప్పటికే ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు బడుగు, బలహీనవర్గాల స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నాయని, సాయుధ పోరాట పిలుపు ప్రభంజనమై, ఉప్పెనగా మారిందన్నారు. ప్రజలంతా ఎక్కడికక్కడే సాయుధలై నిజాం, దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని వివరించారు. కమ్యూనిస్టులు పది లక్షల భూమి పంపిణీ చేశారని, ఇంత పెద్ద మొత్తం భూమిని పంచిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఈ పోరాటంలో 4500 మంది విప్లవకిశోరాలు బలిదానం చేశారని, ఈ గడ్డపై ఏ చెట్టు పుట్టను అడిగినా, నాటి పోరాట చరిత్రను చెబుతాయన్నారు. నాడు తెంలగాణ సాయుధపోరాటం లేకపోతే హైదరాబాద్‌ మరో పాకిస్తాన్‌లాగా ఉండేదని స్వయంగా కెసిఆర్‌ అన్నారని, తెలంగాణ వచ్చినా ఆ పోరాట యోధుల స్మృతిచిహ్నాలు ఏవని ప్రశ్నించారు. 1947 సెప్టెంబర్‌ 17న యూనియన్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నైజాం హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారన్నారు. భారతదేశంలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్‌ 17ను సిఎం కెసిఆర్‌ గుర్తించాలని, లేకపోతే ఇతర పాలకుల మాదిరిగానే మిగిలిపోతారని చాడ అన్నారు.
ఆ పోరాటంలో బిజెపి ఎక్కడ? : నారాయణ
తనది స్వతంత్ర దేశమని నిజాం నియంతలా పాలిస్తుంటే, విప్లవ వీరులు మఖ్దూం, రావి నారాయణరెడ్డిలు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు సెప్టెంబర్‌ 11 అని నారాయణ అన్నారు. ఆ పోరాటంతో నైజాం నియంతను మట్టికరిపించారని చెప్పారు. ఆ పోరాటాన్ని కాంగ్రెస్‌, టిడిపి పాలకులు గుర్తించలేదని, ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తానని, ఐలమ్మ వంటి వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై పెడతామని కెసిఆర్‌ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరు ఏళ్లయినా విగ్రహాలు, అధికారిక ఉత్సవాలు లేవని, కేవలం ఎంఐఎం భయంతోనే అందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. నాటి పోరాటం ముస్లింలకు వ్యతిరేకమని బిజెపి ప్రచారం చేస్తున్నదని, మరి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన మఖ్దూం ముస్లిం అని మరిచారా? అని నిలదీశారు. నాడు సంఘ్‌ శక్తులు బ్రిటీష్‌ తొత్తుల బూట్లు నాకుతూ దేశ విచ్ఛిన్నకారులుగా మిగిలారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్నదని, ఫెడరల్‌ విధానాన్ని ధ్వంసం చేస్తున్నదని నారాయణ విమర్శించారు. సిఎం కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బిజెపికి వ్యతిరేకంగా సమర శంఖం పరించాలని, తాము సహకరిస్తామని అన్నారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ ఇసాయుధ పోరాటానికి దేశంలోనే ప్రత్యేక చరిత్ర ఉన్నదన్నారు. నాటి పోరాటంలో లేనివాళ్ళు ఇప్పుడు తామే చేసినట్లుగా మాట్లాడుతున్నారని బిజెపిని ఎద్దేవా చేశారు. నాడు కమ్యూనిస్టు పార్టీ త్యాగులు చేసి భూమిని పంచిందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments