లండన్: మే 30 నుంచి ప్రపంచకప్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచ కప్‌లో పాల్గొనబోయే జట్ల సారథులందరితో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 10 జట్ల కెప్టెన్‌లు పాల్గొన్నారు. మీడియా సమావేశం ముగిసిన అనంతరం వివిధ జట్ల సారథులందరూ ఫొటోలకు పోజులిచ్చారు. 10 జట్ల సారథులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసిసి తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటులు తెగ వైరల్ అవుతున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్ 5న సౌథాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సమావేశంలో అన్ని జట్ల సారథులు మాట్లాడారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ టీమిండియా మరో ప్రపంచకప్ ట్రోఫీ కోసం అతృతగా ఉందని చెప్పాడు. కాగా తమకు ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో ముప్పు ఉందని, ప్రస్తుతం ఇంగ్లాండ్ భీకర ఫామ్‌లో ఉందని పేర్కొన్నాడు. ఈసారి ప్రపంచకప్‌లో పరుగుల వదర పారడం ఖాయమన్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనూకరిస్తుండటంతో ప్రపంచకప్‌లో భారీ పరుగులు నమోదు కావచ్చని కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు భీకర ఫామ్‌లో ఉంది. వన్డే క్రికెట్లో 500 సాధ్యమైతే.. అది సాధించే తొలి జట్టు ఇంగ్లాండే అవుతుందని కోహ్లీ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడుతూ తమ జట్టు టైటిల్ నిలబెట్టుకోవాలని భావిస్తోందని అన్నాడు. సీనియర్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు జట్టులో రావడంతో తమ జట్టు మరింతగా పటిష్టమైందని ఫించ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లాండ్, సౌతాఫ్రికా కెప్టెన్‌లు తమ తమ జట్లు ఈసారి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడలనుకుంటున్నాయని తెలిపారు. అలాగే విండీస్, పాకిస్థాన్, శ్రీలంక జట్ల సారథులు కూడా కప్పే లక్ష్యంగా ముందుగు సాగుతామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్‌లు ఈసారి తమ తమ జట్లు కొత్త చరిత్ర సృష్టిస్తాయనిధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచకప్ సారథుల ఫొటోషూట్..!
RELATED ARTICLES