మనదేశంలో 50% జనాభా సంపద
9 మంది కోటీశ్వరుల చేతుల్లో!
రోజుకు 2.5 బిలియన్ డాలర్లు పోగేసుకుంటున్న 26 మంది బిలియనీర్లు
పేద, ధనిక అంతరం తగ్గుదల ఉత్తుత్తిమాటే!
నిజాలు నిగ్గుతేల్చిన హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ నివేదిక
న్యూఢిల్లీ : పేద, ధనికవర్గాల మధ్య అంతరం విపరీతంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్లు రోజుకు 2.5 బిలియన్ డాలర్ల మేరకు సంపదను పోగేసుకుంటున్నారు. ప్రపంచ జనాభాలో కేవలం 1 శాతం మంది వద్దనే సగం సంపద పోగుపడింది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కన్పించింది. పైగా కేవలం 9 మంది చేతుల్లోనే దేశంలో సగం సంపద కేంద్రీకృతమైంది. ఈ విష యం అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-డబ్ల్యుఎఫ్) వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో దావోస్ (స్విట్జర్లాండ్)లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన అధ్యయనం ఆసక్తిరేపుతోంది. ఈ ఆక్స్‌ఫామ్ అంతర్జాతీయ నివేదిక సోమవారం విడుదలైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత బిలయనీర్ల సంఖ్య రెట్టింపయింది. ఆర్థిక సంక్షోభం కోటీశ్వరులను ఏ మాత్రం తాకకపోవడం విచిత్రం. తాజాగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2,208కి పెరిగింది. డబ్ల్యుఇఎఫ్ సమావేశంలో ప్రపంచ సంపన్నులు, ప్రభావిత వ్యక్తులు పాల్గొనబోతున్నారు. 106 పేజీల ఆక్స్‌ఫామ్ నివేదికపై చర్చించే అవకాశం వుందని భావిస్తున్నారు. నిజానికి ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ నివేదిక నివేదిక గురించి పట్టించుకోరని, వారి సంపదను రెట్టింపు చేసుకోవడానికి గల మార్గాలపై మాత్రమే చర్చిస్తారని వామపక్ష, ప్రగతిశీలవాదులు విమర్శిస్తున్నారు. వారితోపాటు కొన్ని హక్కుల సంస్థలు దావోస్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాది ప్రపంచంలో కేవలం 26 మంది సంపన్నుల సంపద 1.4 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది 3.8 బిలియన్ల నిరుపేదల మొత్తం సంపదతో సమానం. ఈ సంపన్నుల్లో అత్యధికమంది అమెరికన్లే. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఈ 26 మందే ప్రయత్నిస్తూవుంటారు. వారిలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, బెర్క్‌షైర్ హాతవేకు చెందిన వారెన్ బఫే, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జ్యుకర్‌బర్గ్‌లు వున్నారు. వారిలో జ్యుకర్‌బర్గ్ ఒక్కరే ఏకంగా 357 బిలియన్ డాలర్లను ఆర్జించారు. ప్రపంచవ్యాప్తంగా బిలయనీర్ల ఆదాయం గత ఏడాది 12 శాతం(రోజుకు 2.5 బిలియన్ డాలర్లు) పెరగ్గా.. దిగువన ఉన్న పేదల ఆదాయంలో మాత్రం 11 శాతం క్షీణత కనిపించింది.