అభివృద్ధి విషయంలో పక్కరాష్ట్రాలతో పోటీ లేనేలేదు
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ అభివృద్ధి
పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
హైదరాబాద్ అనువైన ప్రాంతం రండి.. పెట్టుబడులు పెట్టండి
కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్
తమకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవని, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటి.. ఫ్యూచర్ సిటిని అభివృద్ధి చేయబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటి అభివృద్దే నిరూపిస్తుందని తెలిపారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలు ఎపి, కర్ణాటకలతో కాదని, తమ పోటీ ప్రపంచంతోనేనని అన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నానన్నారు. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది అని అన్నారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది తమ సంకల్పం అని అన్నారు. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బుధవారం హైదరాబాద్ శివారులో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌నుఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడారు. తన అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత బుధవారం రాష్ట్రానికి తిరిగి వచ్చామన్నారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా, కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు.తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ స్టేట్ తెలంగాణగా మారనుందన్నారు. ఇప్పటికే రాజధాని శివారులో మూడు రింగ్ రోడ్లు ఉన్నాయని, మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్..అయితే రెండోది సెమీ-అర్బన్ ఏరియా అని, ఇక్కడ తాము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇక మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ అని, అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.
హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. 430 సంవత్సరాల కిందట కులీకుతుభ్ షాహీల నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్‌ను నిర్మించడం జరిగిందన్నారు. ఆ తర్వాత నిజాం బ్రిటీషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్‌ను నిర్మాంచారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లు భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రపంచంతో పోటీ పడాలంటే భారత దేశం సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాలని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటి అభివృద్ధికి పునాది పడిందన్నారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ఐటి అభివృద్ధిని కొనసాగించి సైబరాబాద్ సిటిని అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో 2002లో చిన్న సంస్థగా ఆరంభమైన కాగ్నిజంట్ ఈ రోజు న్యూ క్యాంపస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నిజంట్ ముందుకు వస్తోందన్నారు. భారతదేశంలోనే టాటా బిర్లా లతో పోటీ పడి తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కాగ్నిజంట్ సంస్థ కల్పిస్తోందన్నారు. తద్వారా హైదరాబాద్ మాదిరే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తుండడం పట్ల అభినందిస్తున్నామన్నారు. ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి , ఈ రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఇలాంటి సంస్థల అవసరాలను వినియోగించుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.