మోడీ, ఎన్‌డిఎను ఓడించండి
జనసేన,బిఎస్‌పి,సిపిఐ, సిపిఐఎం కూటమికి పట్టం కట్టండి : సురవరం
ప్రజాపక్షం/అమరావతి: ‘ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి. మళ్లీ బిజెపి గెలిస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉంటాయన్న విశ్వాసం లేదు. ఈ విషయాన్ని బిజెపి తిరుగుబాటు నేతలు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, శత్రుఘ్నసిన్హా ఇప్పటికే సందేహాలు వెలిబుచ్చారు. అందుకే బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలి. ప్రధాని మోడీని గద్దె దించాలి’ అని సిపిఐ ప్రధా న కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాయతీ గల కమ్యూనిస్టులు మాత్రమే ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు. కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌లోనూ, కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సురవరం ప్రసంగించారు. సిపిఐ (ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు జొన్నా శివశంకర్ సభకి అధ్యక్షత వహించారు. జనసేన, లెఫ్ట్ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికలు దేశభవిష్యత్‌కు సంబంధించినవని సురవరం అన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వానికి జవాబుదారీతనమే లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ఏకపక్ష, నియంతృత్వ నిర్ణయాలతో దేశ ఆర్థి క వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. దేశానికి, ప్రజలకు కాకుండా ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ శక్తులకు మోడీ జవాబుదారీగా వ్యవహరిస్తున్నారన్నారు. గోసంరక్షణ పేరుతో దేశంలో దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలను దారుణంగా చంపుతున్నారని సురవరం అన్నారు. మోడీ పాలనలో దళితులు, ము స్లిం మైనారిటీలకు రక్షణ కరవైందన్నారు. ప్రజాస్వామ్యవాదులు, హేతువాదులు లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయని నిందించా రు. ఎన్‌డిఎ పాలనలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగాయన్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. సైనికుల త్యాగాలను సైతం మోడీ సర్కారు నిస్సిగ్గుగా రాజకీయంగా వాడుకుంటున్నదని సురవరం విమర్శించారు. మోడీని, ఎన్‌డిఎ పక్షాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టసభల్లో ప్రజావాణిని వినిపించేది కమ్యూనిస్టులేనని చెప్పారు. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన మంగళగిరిలో సిపిఐ అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరావు గెలుపు అభివృద్ధికి మలుపవుతుందన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో, ప్రజాపోరాటాల్లో ము ప్పాళ్ల ముందుండి పోరాడారన్నారు. నిత్యం ప్రజల మధ్య తిరిగే ముప్పాళ్ల నాగేశ్వరావును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా సిఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఏ ఉద్యమాలు చేశాడని రాజకీయాల్లోకి ప్రవేశించారని ప్రశ్నించారు. జగన్ సైతం ఫిరాయింపుదారులకు భయపడి శాసనసభకి వెళ్లటం మానేశారని విమర్శించారు. మోడీతో జట్టుపై జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో రాజకీయ ప్రత్యామ్నాయానికి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన ఎంపి అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.