HomeNewsBreaking Newsప్రధాని మోడీ నిజస్వరూపం బయటపడింది

ప్రధాని మోడీ నిజస్వరూపం బయటపడింది

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివక్ష
ప్రధాని సమతామూర్తి బోధనలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమే…
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క
ప్రజాపక్షం / హైదరాబాద్‌ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో వివక్షత చూపిన ప్రధాని మోడీ… సమతామూర్తి బోధనలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కసు వెల్లగక్కిన మోడీ నిజస్వరూపం మరోసారి బయటపడిందని అన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడి యా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డితో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు పార్లమెంట్లో లేని మోడీ.. ఇప్పుడు రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని అక్కసు వెళ్లగక్కడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిన సిఎం కెసిఆర్‌ రెండు రోజులుగా బయటకు రాకుండా మౌనంగా ఉండటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మౌనం వీడకుంటే… మోడీ-, కెసిఆర్‌ కలిసి ఆడుతున్న నాటకాలుగా భావించాల్సి వస్తుందని అన్నారు. కేంద్రానికి అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం ఇస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు ఇచ్చి వివక్ష ప్రదర్శిస్తున్న మోడీకి దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ తెలంగాణను మోడీ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందడానికి కర్ణాటక రాష్ర్టంలో హిజాబ్‌ వివాదం సృష్టించి బిజెపి మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. హిజాబ్‌ కొత్తగా ఉన్నది కాదని, కాని ఇప్పుడే ఎందుకు అల్లర్లు అవుతున్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్‌-, నరేంద్రమోడీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ర్టంలో ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళకుండా కెసిఆర్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపనలో ఆర్థిక నేరస్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కార్యక్రమాన్ని బిజెపి రాజకీయ వేదిక మార్చుకోవడానికి చిన్న జీయర్‌ సహకరిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
విభజన హామీలు అమలు చేయాలిః మధుయాస్కీ
నిజంగా తెలంగాణ మీద మోడీ, కెసిఆర్‌లకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాస్కీగౌడ్‌ డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌ అవినీతిపై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అవినీతి మా దగ్గర ఉందని, తప్పకుండా జైలుకు పంపిస్తామని బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వ్యతిరేకం, బిజెపిని బొందపెట్టాల్సిందే అంటూ టిఆర్‌ఎస్‌ నాటాకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ర్ట విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తున్నా విభజన హామీలపై మోడీ, కెసిఆర్‌ ఏమైనా చేసారా అని మధు యాస్కీ ప్రశ్నించారు.
బిజెపి నేతలను తెలంగాణలో తిరగనివ్వొద్దు: నిరంజన్‌
తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమర వీరుల బలిదానాలను చులకన చేస్తూ ప్రధాని మాట్లాడారని టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షులు జి.నిరంజన్‌ విమర్శించారు. తెలంగాణా ప్రజలకు మోడీ క్షమాపణలు చెప్పే వరకు బిజెపి వారిని ప్రజలు తెలంగాణాలో తిరుగనివ్వవద్దని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments