టిడిపి, ఎస్పి, బిఎస్పి వంటి ప్రాంతీయ పార్టీలు బిజెపికి మద్దతునివ్వవు : మీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: చివరి దశ పోలింగ్ దగ్గర పడనుండటంతో బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎస్పి, బిఎస్పి, టిడిపి వంటి ప్రాంతీయ పార్టీలు బిజెపికి మద్దతు ఇవ్వబోవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహం ఏమిటో చెప్పడానికి ఆయన నిరాకరించారు. యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, డా.మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖుల అనుభవాన్ని ఉపయోగించుకుంటామన్నారు. ఇసి పక్షపాతంతో వ్యవహరించిందని, మోడీ ఏం మాట్లాడినా, ఏం చేసినా ఓకె అన్నట్లు వ్యవహరించిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా తప్పన్నట్లు ఇసి వ్యవహరించింద ని, ఇంత జరిగినా సత్యం మాత్రం మాపై ఉందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. తనను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగే మీడియా మోడీని మాత్రం ఆయన డ్రెస్‌ల గురించి మాత్రమే అడుగుతోందని ఎద్దేవా చేశారు. మోడీ, అమిత్‌షా ప్రెస్ మీట్ నిర్వహించారని, కానీ తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాల్ విసిరారు. రైతుల దుస్థితి, నిరుద్యోగం, రాఫెల్2పై మోడీ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. మోడీ, షా ల దగ్గర లెక్కలేనంత సొమ్ము, అధికార బలం వుందని, అనిల్ అంబానీకి మోడీ రూ. 30 వేల కోట్లను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. తానెన్నడూ మోడీ కుటుంబంపై విమర్శలు చేయలేదని, కానీ మోడీ మాత్రం తన కుటుంబంపై విమర్శలు చేశారని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. దేశ ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని, ఇప్పటి వరకైతే ప్రతిపక్ష పాత్రను సమర్థంగానే పోషించామని రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సహకరించిన వారందిరికీ రాహుల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని, కాంగ్రెస్ ఒక్కటే నిజాయితీ ఉన్న పార్టీ అని రాహుల్ చెప్పారు.