ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రే లియా, నేడు రెండో వన్డే
ఉదయం 8:50 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం
ఆడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 34 పరుగులతో ఓటమిపాలైన భారత్ రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకునుందుకు సిద్ధమయింది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించిన ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకబడ్డ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రణాళికలు అల్లుకుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో సుదీర్ఘకాలం టెస్టులు ఆడిన భారత జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగించడంలో విఫలమయింది. బౌలర్లు పర్వాలేదనిపించినా బ్యాట్స్‌మెన్స్ మాత్రం తడబడ్డారు. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అసాధ్యంకాని లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు ఘోరంగా విఫలమయ్యారు. వీరు రెండంకెల స్కోరును కూడా దాటలేక పోయారు. వరుసక్రమంలో వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి అప్పుడు దాదాపు ఖరారయింది. కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి ఆడాడు. విజయమే లక్ష్యంగా ఆడుతూ భారత్‌ను మరోసారి పటిష్ఠ స్థితికి చేర్చాడు. ఇతనికి మహేంద్ర సింగ్ ధోనీ మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్ 137 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించి భారత్‌ను తిరిగి పోటీలో నిలిపారు. కానీ తర్వాత ధోనీ (51) పరుగులు ఔటైన తర్వాత తిరిగి పరిస్థితులు భారత్ చేతినుంచి చేజారాయి. తర్వాత రోహిత్ ఒంటరి పోరాటం చేసి శతకంతో చెలరేగిన మరో ఎండ్ నుంచి ఇతనికి సహకారం అందలేదు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. చివరి వరకు పోరాడిన రోహిత్ శర్మ (133) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో కూడా భారత్ ఇతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు శిఖర్ ధావన్ మంచి సహకారం అందిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా రెండో వన్డేలో రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోందని ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ అంటున్నాడు. సిడ్నీ వన్డేలో తమ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడరనీ.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు భారత సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని అన్నాడు. రెండో వన్డేలో అవి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు తమకు ఈ సిరీస్ చాలా కీలకమనీ, అందుకే ఈ సిరీస్‌ను గెలిచేందుకు చెమటోడ్చుతామని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ సారి బౌలర్లకు బ్యాట్స్‌మెన్స్ కూడా మంచి సహకారం అందిస్తారు. టీమిండియా కలసికట్టుగా రాణించి ఈ మ్యాచ్‌ను సొంతం చేసుకుంటుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
బ్యాటింగ్‌లో సత్తా చాటుతాం..
సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో విఫలమైన భారత బ్యాట్స్‌మెన్లు రెండో వన్డేలో మాత్రం సత్తా చాటుతారని భారత జట్టు యాజమాన్యం చెబుతోంది. ఈ మ్యాచ్‌లో వారందరూ తమ పూర్వ వైభవాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేసింది. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ఖాతా తెరువకుండానే తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. అతను బంతిని సరిగ్గా అంచనా వేయలేక పోయాడు. కానీ, ఆ తప్పు ఈసారి తిరిగి జరగదని, ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు ధావన్ అండగా నిలుస్తాడని భారత బ్యాటింగ్ కోచ్ అన్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరిచి భారత్‌కు శుభారంభాన్ని అందిస్తారిని ఆయన చెప్పాడు. ఇక భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఈసారి తన ప్రతపాన్ని చూపెడుతాడని, ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీ పరుగులు చేస్తాడని కోచ్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఆసీస్ గడ్డపై కోహ్లీకి మంచి రికార్డులు ఉన్నాయి. గత పర్యటనలో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. టెస్టు సిరీస్ ముగియగానే వెంటనే వన్డే సిరీస్ ఆరంభమవ్వడం భారత్‌కు కలిసి రాలేదు. ఫార్మాట్ మారడంతో భారత ఆటగాళ్లు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు వారందరూ మంచి సాధన చేసి రెండో వన్డేకు రెడీ అయ్యారు. అంబటి రాయుడు కూడా ఈసారి తన బ్యాట్‌ను ఝుళిపిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ సిడ్నీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతని స్ట్రాయిక్ రేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 93 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ధోనీ గొప్ప ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయినా కానీ అతనిపై కొందరు విమర్శలు గుప్పించడం సరికాదు. ఆ సమయంలో వికెట్ కాపాడుకోవడమే ముఖ్యం. ధోనీ కూడా అదే చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్‌ను తిరిగి సాధించాడు. ఇక దినేశ్ కార్తిక్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఆసీస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. భారత బ్యాట్స్‌మెన్స్‌ను వరుస విరామాల్లో ఔట్ చేస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించారు. చివర్లో భువనేశ్వర్ కుమార్ దూకుడుగా ఆడినా ఫలితం దక్కలేదు. అయితే మ్యాచ్ అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. ఏ జట్టు గొప్పగా ఆడుతుందో ఆ జట్టుకే విజయం వరిస్త్తుందనడంలో సందేహం లేదు. భారత బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట్లో ఆసీస్ దూకుడును చూస్తుంటే 300పై స్కోరు చేస్తారని కనిపించింది. కానీ సరైన సమయంలో వారు పుంజుకుని ఆసీస్‌ను కట్టడి చేశారు. రెండో వన్డేలో మరింత మెరుగైన ప్రదర్శనలు చేస్తారని భారత సారథి ధీమా వ్యక్తం చేశాడు. పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పకుండా ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌ను అడ్డుకుంటారని కోహ్లీ పేర్కొన్నాడు.
సిరీస్‌పై కన్నేసిన ఆసీస్..
తొలి వన్డే విజయంతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టు ఇక సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సాధించాలని భావిస్తోంది. సిడ్నీ వన్డేలో ఆసీస్ కలిసి కట్టుగా రాణించింది. ముందు బ్యాట్స్‌మెన్స్ గొప్ప ప్రదర్శనలు చేశారు. తర్వాత బౌలర్లు చెలరేగి విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో ఆసీస్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. గత ఏడాది పేలవమైన ఆటతో ఆసీస్ జట్టు నిరాశ పరిచింది. కానీ ఈ ఏడాది ఆరంభపు మ్యాచ్‌నే గెలిచి తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. టెస్టు సిరీస్‌లో తడబడిన బ్యాట్స్‌మెన్స్ తొలి వన్డేలో సత్తా చాటారు. హాండ్స్‌కొంబ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్‌ముగ్గురు హాఫ్ సెంచరీలతో జట్టుకు అండగా నిలిచారు. స్టోయినిస్ కూడా అజేయంగా (47) పరుగులు చేసి భారీ స్కోరు సాధించడంలో తన వంతు సహకారం అందించాడు. మ్యాక్స్‌వెల్ కూడా దూకుడుగా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లో రిచర్డ్‌సన్ విజృంభించాడు. నాలుగు వికెట్లు తీసి భారత్ ఓటమిని దాదాపు ఖరారు చేశాడు. మరోవైపు బెహెర్న్‌డార్ఫ్, స్టోయినిస్ చెరో రెండు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ రోజు ఆడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో భారత్‌కు సిరీస్ కపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం. రెండో వన్డేలో భాతర్‌పైనే ఒత్తడి ఉంది. కానీ భారత్ ఆటగాళ్లు పుంజుకుంటే వారిని అడ్డుకోవడం ఆసీస్‌కు పెద్ద పరీక్షే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.