ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయ నిర్మాణం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
మంత్రులు తుమ్మల, పొంగులేటి
ప్రజాపక్షం/ ఖమ్మం అర్బన్ ఖమ్మంలో నిర్మించే గ్రంథాలయంలో అధునీక సౌ కర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజల వద్దకే పాలనను తీసుకు వచ్చి ప్రతి సమస్యకు పరిష్కా రం చూపుతున్నామన్నారు. బుధవారం మంత్రు లు తుమ్మల, పొంగులేటి పాలేరు, ఖమ్మం నియోజక వర్గాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలు చోట్ల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలంతో పాటు ఖమ్మం నగరంలో
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఖమ్మం పాత కార్పోరేషన్ కార్యాలయంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత డిఇఒ కార్యాలయం వద్ద అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం పొంగులేటి మాట్లాడుతూ సోనియా గాంధీ చెప్పినట్లు పేదల కష్టాన్ని తీర్చేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించామని ఆయన తెలిపారు. మూడు నెలల్లో 31వేల ఉద్యోగాలు ఇచ్చామని గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా అనేక ఉద్యోగ నియామకాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. మెగా డిఎస్‌సి ద్వారా 11062 ఉద్యోగాలను ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో ప్రజలు ఎంఎల్‌ఎను కలవడం ఇబ్బందిగా ఉండేదని కానీ, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రినే కలిసే అవకాశం ఏర్పడిందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు అధునీక సౌకర్యాలతో గ్రంథాలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో తాగునీటి ఎద్దడి లేకుండా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా కోసం తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగర్‌లో నీళ్లు లేనందున కర్ణాటక నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చామన్నారు. పేదలకు అన్నదానం చేస్తున్న ఇస్కాన్ సంస్థకు భూమి కేటాయిస్తామని ఆక్రమణకు గురైన వక్ప్‌బోర్డు భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విపి గౌతమ్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, మాజీ ఎంఎల్‌సి బాలసాని లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.