సోషల్ మీడియాలో పోస్టులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
దేశ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న పోస్టులపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపిస్తున్నారంటూ ఆగ్రహించింది. ఇలాంటి పోస్టుల వల్ల దేశ పరువుప్రతిష్టలు దారుణంగా దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా విజృంభణకు నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఇస్లామిక్ సమ్మేళమే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై జమాయత్ ఉలేమా హింద్ సహా పలు సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసి న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలో, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎఎస్ బొపన్న సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరికివారు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బలంగా వాదించే వారి గొంతు మాత్రమే వినిపిస్తున్నదని, న్యాయ వ్యవస్థ లేదా ప్రజాస్వామిక వ్యవస్థల అభిప్రాయాలు ఉండడం లేదని పేర్కొంది. బలవంతులవైపే సోషల్ మీడియా ఉం దని వ్యాఖ్యానించింది. తప్పుడు సమాచారం, వార్తల కారణంగా దేశం పరువు పోతున్నదని పేర్కొంది. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఏదైనా విధానాన్ని అవలంభిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారం రాకుండా అడ్డుకొని, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకే కొత్త ఐటి నిబంధనలను తీసుకొచ్చినట్టు చెప్పారు. వాటిని అమలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం కాకుండా నిరోధించగలుగుతామని అన్నారు. ఈ కొత్త ఐటి నిబంధనలపై వివిధ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తెప్పించుకొని, ఒకేసారి విచారణ కొనసాగించాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ, ఆరు వారాల గడువును ఖారారు చేశారు. ఈలోగా అన్ని కోర్టుల నుంచి కేసులను తెప్పించే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ముస్లిం బోర్డు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే తన వాదన వినిపిస్తూ, కొత్త ఐటి నిబంధనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టులోనే విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజాముదీన్ మర్కజ్ సమావేశాన్ని సూపర్ స్ప్రెడర్‌గా సోషల్ మీడియాలో పేర్కోవడాన్ని నిషేధించాలని కోరారు. ముస్లింలు అందరినీ కొవిడ్ వ్యాప్తికి కారకులుగా కొంత మంది పేర్కొంటున్నారని, ఇది అత్యంత దారుణమని ఆయన అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ జోక్యం చేసుకుంటూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వార్తలు లేదా కథనాలను కట్టడి చేసేందుకు కొన్ని చట్టాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా అక్కడ జవాబుదారీ కూడా ఉంటుందని తెలిపారు. అలాంటి చట్టాలుగానీ, జవాబుదారీతనంగానీ సోషల్ మీడియాలో ఉందా? అని ప్రశ్నించారు. టివి మాధ్యమంగా వచ్చే అన్ని రకాల కార్యక్రమాలకు 1995 కేబుల్ టివి నెట్‌వర్క్ చట్టం ఉందని ఆయన అన్నారు. అలాంటి వ్యవస్థ సోషల్ మీడియాకు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, కొత్త ఐటి చట్టాల ద్వారా ఇది సాధ్యమవుతుందని అన్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంపై సుప్రీం కోర్టు తీవ్రంగానే వ్యాఖ్యలు చేసింది. ఈ వేదికను కొంత మంది ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను వాడుకుంటూ, సమాజంలో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఇష్టానుసారంగా పోస్టులు ఉంటున్నాయని, బలవంతుల అభిప్రాయాలే వినిపిస్తున్నాయని పేర్కొంది. అన్ని అంశాలనూ, సంఘటనలను మతం కోణంలోనే చూడడం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రతి విషయంలోనూ మత కోణమేనా?
RELATED ARTICLES