ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడిని ఆదుకోవాలని ప్రధానమంతి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. గురువారంనాడు ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది ఇటీవలకాలంలో సిఎంలతో ప్రధాని నిర్వహించిన రెండో వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ 19 రోగం నుంచి ప్రతి ఒక్క భారతీయుడిని రక్షించడం అనేది దేశ ఉమ్మడి లక్ష్యం కావాలని ప్రధాని అన్నారు. కచ్చితంగా చేయాల్సిన చర్యల జాబితాను ప్రధాని సూచించారు. సంపూర్ణ లాక్‌డౌన్ రెండో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కొన్ని వారాలపాటు కరోనా పరీక్షలు, రోగ నిర్ధారణ, బాధితుల గుర్తింపు, ఐసోలేషన్, క్వారంటైన్‌లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే కరోనాను అదుపు చేసేందుకు అన్ని రాష్ట్రాలు జిల్లా స్థాయి కృషిని సమన్వయపర్చాలని కోరారు. ఈ అంటువ్యాధిని అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం వుందని, అందుకోసం జిల్లాల వారీగా టెస్టు రిపోర్టులను ఎప్పటికప్పుడు ప్రైవేటు లేబొరేటరీల నుంచి సమకూర్చుకోవాలని కోరారు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే సాధ్యమైనంత త్వరగా జిల్లా స్థాయి వ్యాధి నిఘా అధికారులను నియమించాలని మోడీ కోరారు. వైద్య పరికరాలు, మందులు సరఫరాలో రాజీపడవద్దని, ఉత్పాదక శక్తిని అవసరమైనంత మేరకు పెంచుకోవాలని, ఈ విషయంలో కొరత వుండకుండా చూడాలని కోరారు. అలాగే కొవిడ్ 19 కోసం ప్రతి రాష్ట్రం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వైద్య బృందాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం వుందన్నారు. కొవిడ్ 19 చికిత్సలో డాక్టర్ల ఆన్‌లైన్ శిక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని సిఎంలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పంట చేతికొచ్చే సమయం ఇదే అయినందున, రైతులు, రైతు కూలీలను లాక్‌డౌన్ నుంచి మినహాయించి, వారి వారి వ్యవసాయ పనులు చేసుకునేలా అనుమతినివ్వాలని సూచించారు. పొలంలో సైతం సామాజిక దూరం పాటించేలా సూచనలివ్వాలన్నారు. పంట ఉత్పత్తుల సేకరణ విషయంలో వ్యవసాయ ఉత్పాదక మార్కెటింగ్ సంస్థలు (ఎపిఎంసి)పై మాత్రమే ఆధారపడకుండా, ఇతర మార్గాలను కూడా అన్వేషించాలని, ప్రతి గింజను కొనుక్కునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్కెట్‌కు ఉత్పత్తులను చేరవేసేందుకు, రైతులకు గిట్టుబాటు ధర సక్రమంగా చెల్లించే క్రమంలో ఒక ట్రక్ పూలింగ్ స్కీమ్‌ను రైతుల కోసం రూపొందించాలన్నారు. పంట కోతను కూడా అవసరమైన మేరకు వ్యూహాత్మకంగా సాగేలా చూడాలన్నారు. ఈ నెలకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కోసం 11,000 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధులను కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ఉపయోగించాలని కోరారు. కొవిడ్ 19తో పోరాడేందుకు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ సేవకులను కూడా వాడుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే ఇతర ఎన్‌జీవోల సహకారాన్ని తీసుకోవాలని, వారితో సమన్వయం చేసేందుకు సంక్షోభ నిర్వహణ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆయుర్వేదం వంటి భారతీయ సాంప్రదాయ మార్గాల ద్వారా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేయాలని కోరారు.
ప్రతి భారతీయుడిని ఆదుకుందాం
RELATED ARTICLES