సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతి కరోనా చావుకు సిఎం కెసిఆరే బాధ్యుడని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళిన కరోనా పేషెంట్లు సదుపాయాలు లేవని ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నా కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అన్ని కార్యక్రమాలు పక్కనబెట్టి, కేవలం కరోనాపైనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.రాష్ర్టం లో బెల్ట్ షాపులు రాజ్యం ఏలుతున్నాయని,ఏ గ్రామం లో చూసిన బెల్ట్ షాపులే ఉన్నాయన్నారు. వైన్ షాపుల వద్ద కూడా భౌతిక దూరాన్ని పాటించడం లేదని, దీంతో వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.కెసిఆర్ కు ఆదాయం పైన ఉన్న దృష్టి, ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 700 మంది డాక్టర్‌ల కొరత ఉన్నదని, ఆరేళ్ళుగా డాక్టర్ ల కొనసాగుతున్న ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదన్నారు. తమకు జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్టు డాక్టర్‌లు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని భట్టి తెలిపారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న ఉద్యోగులకు జీతాలు డబుల్ చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించారు నీటిపారుదల శాఖను సిఎం కెసిఆర్ భ్రష్టు పట్టించారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో బిజినెస్ రూల్స్ పాటించడం లేదని, మురళీధర్ రావు అనే ఇఎన్‌సి రిటైరై ఆరేళ్ళు అవుతున్నదని, ఆయన తోనే ఇరిగేషన్ నిధులను ఖర్చు చేయిస్తున్నారని అన్నారు. కాం ట్రాక్టు ఇఎన్‌సి కాబట్టి కెసిఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారని ఆరోపించారు. బిజినెస్ రూల్స్ పాటించకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కూడా బాధ్యుడుని చేస్తామని, అవసరమైతే ఇరిగేషన్ అక్రమాలపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
ప్రతి కరోనా చావుకు సిఎం కెసిఆరే బాధ్యుడు
RELATED ARTICLES