సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు, మంత్రుల ఇళ్ళముందు వారి ఆఫీసుల ముందు జయప్రదంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. గత 37 రోజలుగా సమ్మె చేస్తున్నారని, దాదాపు 25 మంది ఆర్‌టిసి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌టిసిలో 30 శాతం మహిళలు పనిచేస్తున్నారని, దాదాపు 9 వేల మంది ముస్లిం కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇది కేవలం ఆర్‌టిసి సమస్య కాదని యావత్ ప్రజల సమస్యగా తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. నేటి పిలుపు బ్రహ్మాండంగా జయప్రదం అయిందనన్నారు.. ఘేరావ్‌లో పాల్గొన్న కార్మికులకు, ప్రజలకు నారాయణ అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా సరే ఎంఐఎం నుండి టిఆర్‌ఎస్ దాకా గ్రౌండ్ రియాలిటీని చూడాలని సూచించారు. ఆర్‌టిసి న్యాయబద్దసమస్యను పరిష్కారం చేయాలని, ప్రతిష్టకు పోవద్దని నారాయణ కోరారు. పరిష్కారం చేయకపోతే సమస్య మరింత జఠిలమవుతుందని హెచ్చరించారు.
జెఎన్‌యు విద్యార్థుల ఆందోళనకు మద్దతు
జెఎన్‌యు విద్యార్థుల న్యాయసమ్మతమైన ఆందోళనకు సిపిఐ మద్దతు ఉంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఒక్కసారిగా 300 శాతం ఫీజు పెంచడంపై విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్యాంపస్ లోపల కాన్వెన్షన్‌లో పాల్గొన్నారన్నారు. అదే సందర్భంలో విద్యార్థులపై వాటర్ కేన్ ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జెఎన్‌యు క్యాంపస్‌ను పాకిస్థాన్ లాగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భావిస్తూ విద్యార్థులపై దమనకాండ అమలు చేయడాన్ని తీవ్రంగా భావిస్తున్నామన్నారు. తక్షణం వైస్ చాన్సలర్ విద్యార్థి ప్రతినిధులతో చర్చించి పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు.