హైదరాబాద్ : క్రీడల్లో పోటీలు ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతాయని, విద్యార్థులకు ఆటల్లో పట్టును సాధించేందుకు తగిన శిక్షణ అవసరమని తెలంగాణ స్పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు అన్నారు. స్పోర్ట్ హాస్టల్ పూర్వ విద్యార్థుల వెల్ఫేర్ అసోసియేషన్ రెండ్రోజుల పాటు లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన ఎల్.వెంకట్రామ్రెడ్డి స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. స్పోర్ట్ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ దివంగత ఎల్.వెంకట్రామ్ రెడ్డి పేరిట పోటీలను నిర్వహించడం ఇది రెండోసారి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 21 బాలుర జట్లు, 19 బాలికల జట్లు నువ్వా-నేనా అన్నంతగా పోటీలో నెగ్గేందుకు పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ క్రీడల్లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు చదువులోనూ చురుగ్గా ఉంటారన్నారు. భవిష్యత్తులో క్రీడా రంగంలో ఎదగాలనుకునే వారు నిరంతరం సాధన చేయల్సి ఉంటుందన్నారు. ఆటల్లో పట్టు సాధించాలనే తపన, పట్టుదలను ఏర్పరచుకుని ఆ దిశగా లక్ష్యాన్ని నిర్థేశించుకున్నప్పుడే ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారులు, టిఎస్‌ఆర్‌టిసి సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. రెండ్రోజుల పాటు జరిగిన టోర్నమెంట్‌లో తెలంగాణ స్పోర్ట్ స్కూల్ (హకీంపేట) ఛాంపియన్‌గా నిలిచింది.
ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం
RELATED ARTICLES